Share News

అర్వింద్‌ కుమార్‌పై వేటు

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:25 AM

కొంతమంది ఐఏఎస్‌ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. మరికొంతమందికి కీలక బాధ్యతలు అప్పగించింది. వెరసి, భారీ సంఖ్యలో ఐఏఎ్‌సలను బదిలీ చేసింది. ఒకేసారి 45 మంది పోస్టుల్లో మార్పుచేర్పులు చేపట్టింది...

అర్వింద్‌ కుమార్‌పై వేటు

  • వెయిటింగ్‌కు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి

  • విపత్తుల నిర్వహణ నుంచి తప్పించి తిరిగి పోస్టింగ్‌ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

  • ‘ఫార్ములా-ఈ కార్‌’లో ఆయనపై ఆరోపణలు

  • నారాయణ్‌పేట్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా టీఎంఎస్‌ఐడీసీఎస్‌ ఎండీ ఫణీంద్ర రెడ్డి

  • పుష్కరాల ప్రత్యేకాధికారిగా హన్మంతరావు

  • గౌరవ్‌ ఉప్పల్‌కు కీలక బాధ్యతలు

  • 43 మంది ఐఏఎస్‌, ఇద్దరు నాన్‌ క్యాడర్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కొంతమంది ఐఏఎస్‌ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. మరికొంతమందికి కీలక బాధ్యతలు అప్పగించింది. వెరసి, భారీ సంఖ్యలో ఐఏఎ్‌సలను బదిలీ చేసింది. ఒకేసారి 45 మంది పోస్టుల్లో మార్పుచేర్పులు చేపట్టింది. వీరిలో ఇద్దరు నాన్‌-కేడర్‌ అధికారులు కాగా.. మిగతా 43 మంది ఐఏఎస్‌ అధికారులే. వీరిలో ఇద్దరు సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి కొత్త పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్‌ రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రధానంగా, సీనియర్‌ ఐఏఎస్‌, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇప్పటికే ఈయన ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కీలక భూమిక పోషించారు. ఔటర్‌ రింగు రోడ్డు టోల్‌ వసూళ్ల కాంట్రాక్టు అప్పగింత, ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌ కుమార్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరు 17న లూప్‌లైన్‌కు పంపింది. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అప్పటి నుంచీ ఆయన అదే పోస్టులో కొనసాగుతున్నారు. రాబోయే అక్టోబర్‌లో పదవీ విరమణ పొందనున్నారు. ఇంకా 8 నెలల కాలమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా ‘వెయిటింగ్‌’లోకి పంపడం విశేషం. అలాగే, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ ఫణీంద్ర రెడ్డిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.


ఆయనను నారాయణ్‌పేట్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, సీఎ్‌సఎస్‌ల సమన్వయాధికారి గౌరవ్‌ ఉప్పల్‌ను రాష్ట్రానికి రప్పించింది. ఆయనను ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా నియమించి, టీజీఆర్‌ఏసీ ఎక్స్‌ అఫిషియో డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సాగునీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా రెండేళ్ల నుంచి పని చేస్తున్న రాహుల్‌ బొజ్జాను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌)గా నియమించింది. ఐటీ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న భవేష్‌ మిశ్రాను అదే శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఎం.హన్మంత రావును మళ్లీ దేవాదాయ శాఖకు రప్పించి, సంచాలకుడిగా పోస్టింగ్‌ ఇచ్చింది. గోదావరి పుష్కరాల స్పెషలాఫీసర్‌గా కొత్త పోస్టును సృష్టించి ఆయనకు బాధ్యతలు అప్పగించింది. సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ను ఇటీవలే ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌ బాధ్యతల నుంచి తప్పించిన ప్రభుత్వం.. తిరిగి ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌గా నియమించింది.

Updated Date - Feb 27 , 2026 | 04:25 AM