టిమ్స్‌లో డబుల్ స్పెషాలిటీ
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:15 AM
తెలంగాణ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)కు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో టిమ్స్ ఆస్పత్రిలో ఒక్కో సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు దానికి అనుబంధంగా ఉండేలా....
ఒక్కోచోట రెండేసి చొప్పున స్పెషాలిటీ వైద్య సేవలు.. సనత్‌నగర్ టిమ్స్‌కు అదనంగా మరో 200 కోట్లు
మల్టీలెవల్ పార్కింగ్, పీజీ హాస్టల్, క్యాంటీన్ నిర్మాణం
అంతర్జాతీయ రోగులకు ప్రతి టిమ్స్‌లో 100 పడకలు
నిమ్స్ తరహాలో యూజర్ చార్జీల వసూలు
హైదరాబాద్, జూన్ 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)కు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో టిమ్స్ ఆస్పత్రిలో ఒక్కో సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు దానికి అనుబంధంగా ఉండేలా మరో స్పెషాలిటీ వైద్య సేవలను ప్రవేశపెట్టనుంది. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి కోసం మరో రూ.200 కోట్లు అదనంగా కేటాయించనుంది. పాత ప్లానింగ్‌లో కొన్ని లోపాలున్నాయని గుర్తించి, వాటిని సరిదిద్దే ప్రక్రియలో భాగంగా మరికొన్ని నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. వీటికి అదనంగా మరో రూ.200 కోట్లు అవుతాయని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు.
రెండేసి చొప్పున స్పెషాలిటీ వైద్య సేవలు
ప్రస్తుతం నగరంలో ప్రభుత్వం మూడు టిమ్స్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. సనత్‌నగర్ టిమ్స్‌ను సుమారు రూ.882 కోట్లతో 22.6 ఎకరాల విస్తీర్ణంలో 111.68 లక్షల చదరపు అడుగుల్లో కడుతున్నారు. అత్యంత అధునాతనమైన 16 స్పెషాలిటీలు, 15 సూపర్ స్పెషాలిటీల విభాగాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో టిమ్స్ ఆస్పత్రి ఒక్కో ప్రత్యేక వైద్య విభాగానికి సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్‌గా సేవలందించనుంది. సనత్‌నగర్ టిమ్స్‌ను కార్డియాక్ కేర్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్, కార్డియోథొరాసిక్ కోసం వినియోగించనున్నారు. గుండె జబ్బులకు అనుసంధానంగా ఉండే మరో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా ఇక్కడ ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి లివర్, కిడ్నీ మార్పిడి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే డయాలసిస్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో అదనపు సౌకర్యాల కోసం మరో రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో 700-1000 కార్లు పార్కింగ్ చేసేలా మల్టీలెవల్ పార్కింగ్, పీజీ హాస్టల్, క్యాంటీన్, సుమారు వందకుపైగా టాయిలెట్స్(పేషంట్ అటెండెర్స్ కోసం) నిర్మించబోతున్నారు. అల్వాల్ టిమ్స్‌ను సుమారు రూ.897 కోట్లతో 11.53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ట్రామాకేర్, నూర్యాలజీ, న్యూరోసైన్సె్‌సకు అనుబంధంగా స్పెషాలిటీ వైద్య సేవలను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. ఎల్బీనగర్ టిమ్స్‌ను సుమారు రూ.900 కోట్లతో 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్నారు. ఇక్కడ గ్యాస్ట్రో సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు అదనంగా పిడియాట్రిక్ సెంటరాఫ్ ఎక్స్‌లెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. దాంతో నీలోఫర్‌పై భారం బాగా తగ్గుతుందని అంచనా వేస్తోంది.
పడకల విభజన ఇలా
ఒక్కో టిమ్స్ ఆస్పత్రిలో వేయి పడకలుంటాయి. వీటిలో సుమారు 100 వరకు అంతర్జాతీయ రోగుల కోసం కేటాయించనున్నారు. మరో 300 పడకలు ఐసీయూ బెడ్స్ ఉంటాయి. మరో 300 పడకలు జనరల్ పబ్లిక్, ఆరోగ్యశ్రీ కోసం కేటాయించనున్నారు. ఇంకో 40 పడకలు డయాలసిస్ యూనిట్స్ కోసం కేటాయించనున్నారు. మరో 200 బెడ్స్ పూర్తిగా పెయిడ్ సర్వీసెస్ కోసం కేటాయిస్తున్నారు. ప్రైవేటు కార్పోరేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించలేని వారి కోసం ఈ బెడ్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక నిమ్స్ తరహాలోనే యూజర్ చార్జీలను మూడు టిమ్స్‌లలో వసూలు చేయనున్నారు. సెల్ఫ్ ఆటానమస్ సంస్థలు కావడంతో వీటికివే ఆదాయం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి నిమ్స్‌లో ఉండే యూజర్ చార్జీలనే ఇక్కడ కూడా వసూలు చేయనున్నారు.