Share News

సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకమండళ్లు

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:21 AM

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్‌ పద్ధతిలో పాలకమండళ్లు నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకమండళ్లు

  • ఎన్నికలు నిర్వహించకూడదని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం

  • వ్యవసాయ మార్కెట్‌ కమిటీల తరహాలోనే నియామకాలు

  • ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’..4నెలల క్రితం ప్రత్యేక కథనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్‌ పద్ధతిలో పాలకమండళ్లు నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా... వీటికి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు డైరెక్టర్‌ పోస్టులను కూడా నామినేటెడ్‌ పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సహకార ఎన్నికలు లేకుండానే పీఏసీఎ్‌సల పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. సహకార సంఘాలకు పాలకమండళ్లు ఏర్పాటుచేశాకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(డీసీఎమ్మెస్‌)తోపాటు రాష్ట్రస్థాయిలో ఉన్న మార్క్‌ఫెడ్‌, టెస్కాబ్‌లకు కూడా ఇదే తరహాలో పాలకవర్గాలు ఏర్పాటుచేయనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. నామినేటెడ్‌ పద్ధతిలో ఈ నియామకాలు చేపడితే... 908 మందికి చైర్మన్లుగా, మరో 908మందికి వైస్‌ చైర్మన్లుగా, 9,988మందికి డైరెక్టర్లుగా అవకాశం వస్తుంది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ఎలాగైతే పాలకవర్గాలను నామినేటెడ్‌ పద్ధతిలో నియమిస్తున్నారో అదే పద్ధతిలో సొసైటీలకు పాలకమండళ్లను నియమించనున్నారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ ఇదే విషయాన్ని చెప్పింది. 23 డిసెంబరు 2025 న ‘ఆంధ్రజ్యోతి’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కాగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల పాలకవర్గాలను నామినేటెడ్‌ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నారు. సాధారణంగా ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే... ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే మార్కెట్‌ కమిటీలకు ప్రతిపాదనలు ఇస్తారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్నచోట... అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్ల ప్రతిపాదనల మేరకు మార్కెట్‌ కమిటీలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ ప్రక్రియతో 100 శాతం పోస్టులు అధికారపార్టీ కార్యకర్తలకే వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 12వేల మంది అధికారపార్టీ కార్యకర్తలకు అవకాశాలువస్తాయి. పీఏసీఎస్‌ పాలకవర్గం కూర్పు 13మందితో ఉంటుంది. ఇందులో ఒకరు చైర్మన్‌, ఒకరు వైస్‌చైర్మన్‌, 11మంది డైరెక్టర్లు ఉంటారు. వీరినుంచే డీసీసీబీ- డీసీఎమ్మెస్‌ డైరెక్టర్లు, మార్క్‌ఫెడ్‌- టెస్కాబ్‌ డైరెక్టర్లు, చైర్మన్లు నియమితులవుతారు.


13 మందితో సొసైటీ పాలకవర్గం

సహకారచట్టం ప్రకారం ప్రతి సొసైటీకి 13 మందితో పాలకవర్గం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకరు చైర్మన్‌, ఒకరు వైస్‌చైర్మన్‌, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్సీ మహిళ, ఎస్టీ జనరల్‌, బీసీ జనరల్‌... కేటగిరీలకు మూడు డైరెక్టర్‌ పోస్టులు రిజర్వు చేస్తారు. మిగిలిన 10 మంది డైరెక్టర్లను జనరల్‌ కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇదే తరహాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (డీసీఎమ్మెస్‌), రాష్ట్రస్థాయిలో మార్క్‌ఫెడ్‌, టెస్కాబ్‌ పాలకవర్గాలను కూడా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయనుంది. అయితే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారితో మాత్రమే పాలకవర్గాలను ఏర్పాటుచేయాలని, సొసైటీల్లో సభ్యత్వంలేని వారికి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Apr 24 , 2026 | 04:21 AM