Share News

రైతులు పండించిన ప్రతి గింజా కొంటాం

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:59 AM

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గ్లోబల్‌ రైస్‌ పవర్‌హౌస్‌గా మారిందని వ్యాఖ్యానించారు....

రైతులు పండించిన ప్రతి గింజా కొంటాం

  • గ్లోబల్‌ రైస్‌ పవర్‌ హబ్‌గా తెలంగాణ.. మీరు చెప్పినవారిని నియమించకపోతే కుంభకోణమా?: మంత్రి ఉత్తమ్‌ ఆగ్రహం

  • ఆపరేషనల్‌ ప్రాఫిట్‌లోకి ఆర్టీసీ: పొన్నం

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గ్లోబల్‌ రైస్‌ పవర్‌హౌస్‌గా మారిందని వ్యాఖ్యానించారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా.. ‘మంత్రిగారు హెలికాప్టర్‌లో పోయారు’ అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ‘‘హెలికాప్టర్‌లో పోయేదేముందయ్యా... నేను యుద్ధ విమానాన్ని 3 వేల గంటలు నడిపాను.’’ అని కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్రంలో 86 లక్షల టన్నుల వరిధాన్యం గోదాముల్లో ఉందని.. దాన్ని విక్రయించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్వింటాలు రూ.3600 చొప్పున ఫిలిప్పీన్స్‌కు బియ్యాన్ని విక్రయించామన్న ఉత్తమ్‌.. ఫిలిప్పీన్స్‌ బియ్యంపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ‘‘మధ్యవర్తిత్వం కోసం నియమించాలంటూ ఆయన (హరీశ్‌రావు) ఒక మనిషిని పౌరసరఫరాల కమిషనరేట్‌కు పంపించారు. మీకు వేరే ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ, మీరు సిఫారసు చేసిన వ్యక్తులను మేం అంగీకరించకపోతే దాన్ని స్కామ్‌ అనడం పూర్తిగా నాన్‌సెన్స్‌. ఫిలిప్పీన్స్‌ బియ్యం ఎగుమతులకు ప్రేమ్‌చంద్‌గార్గ్‌కు ఎటువంటి సంబంధం లేదు. 8-10 లక్షల టన్నులకు ఎంవోయూ అయితే.. లక్ష టన్నులకు ఒప్పందం కుదిరింది. ఫిలిప్పీన్స్‌లో జరిగిన సంక్షోభంతో బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. మీరు పైరవీలు చేసి, ఆమోదం లభించకపోతే కుంభకోణం అంటారు. ఈ బియ్యం ఎగుమతుల్లో మధ్యవర్తి లేడు. ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ఆమోదంతో ఆదిత్యాబిర్లా కంపెనీకి బాధ్యతలు ఇచ్చాం. గోడౌన్‌, షిప్పింగ్‌, ఇన్సూరెన్స్‌ అన్ని చార్జీలనూ ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వమే భరిస్తుంది’’ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ సోనామసూరి, తెలంగాణ బాస్మతి రకాలను ఎగుమతి చేయనున్నట్టు మంత్రి తెలిపారు.


జూన్‌లోగా భూసేకరణకు రూ.5 వేల కోట్లు

రానున్న జూన్‌లోగా నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ కోసం రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ సభలో ప్రకటించారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ భూసేకరణ పూర్తిచేసి, నీటిని అందిస్తామని తెలిపారు. అంతకు ముందు కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌‌బాబు మాట్లాడుతూ ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దవాగుపై జగన్నాథపూర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం జలయజ్ఙంలో భాగంగా చేపట్టిందని, 2014 దాకా 90 శాతం పనులు పూర్తయ్యాయని, 2014-19 దాకా ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదని గుర్తుచేశారు. మల్లన్నసాగర్‌లో కొన్ని ప్యాకేజీల భూసేకరణ ఆగిపోయిందని, దీనికి నిధులు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఐదు మోటార్లకు గాను 3 మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయని, రెండు మోటార్లు రిపేర్‌చేయాలని అభ్యర్థించారు.

లాభాల్లోకి..

‘‘ఆర్టీసీని నడపలేం, మూసివేస్తాం అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉండగా చెప్పింది. పదేళ్లపాటు కొత్త బస్సులు కొనకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీని ఆపరేషనల్‌ ప్రాఫిట్‌లోకి తెచ్చాం’’ అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆర్టీసీ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? ఎప్పట్లోగా యూనియన్లను పునరుద్ధరిస్తారు? ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పట్లోగా గుర్తిస్తారు? అంటూ హరీశ్‌రావు వేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 15 ఏళ్లు నిండిన బస్సులను రీ ప్లేస్‌ చేస్తున్నామని, మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ విలీన అంశం కమిటీ పరిశీలనలో ఉందన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 05:59 AM