Share News

జూన్‌ 2న ఉద్యోగులకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

ABN , Publish Date - May 16 , 2026 | 04:17 AM

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ఉద్యోగులకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

జూన్‌ 2న ఉద్యోగులకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

  • ఆర్థికేతర అంశాలు వీలైనంత త్వరగా పరిష్కారం

  • జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలో సీఎస్‌ కె.రామకృష్ణారావు

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ఉద్యోగులకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం సీఎస్‌ అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉన్నతాధికారులను సీఎస్‌ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, డైరెక్టరేట్ల స్థాయిలో కూడా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులకు బదిలీల నిషేధం నుంచి మినహాయింపు కల్పించాలని ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌ కుమార్‌ సీఎ్‌సకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న వీఆర్‌ఏల కారుణ్య నియామకాలను పరిష్కరించాలని కోరారు. తొలగించిన ఔట్‌సోర్సింగ్‌ ఆపరేటర్ల విషయంపై మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు రైలు ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్‌ రామకృష్ణారావు.. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ప్రాజెక్టుల కోసం కేంద్ర రైల్వేశాఖతో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రస్థాయి సహకార అభివృద్ధి సమన్వయ కమిటీ (ఎస్‌సీడీసీ) సమావేశంలో సీఎస్‌ మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించటంలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.

Updated Date - May 16 , 2026 | 04:17 AM