ప్రైవేటు స్కూలు ఫీజులపై నియంత్రణ!
ABN , Publish Date - May 20 , 2026 | 03:37 AM
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించి...
ముసాయిదా బిల్లు సిద్ధం.. 23న మంత్రివర్గ భేటీలో చర్చ
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించి, ఎప్పటికపుపడు పర్యవేక్షించే ఉద్దేశంతో ఒక చట్టాన్ని తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసంస్కరణలపై విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. ఆ బిల్లులో ఉండాల్సిన అంశాల్ని కూడా పేర్కొంది. తాజాగా విద్యాశాఖ అధికారులు వాటిపై చర్చించి, న్యాయపరమైన అభిప్రాయాలు తీసుకుని ఒక తుది ముసాయిదా బిల్లు రూపొందించారు. ఈ బిల్లును ఈనెల 23న జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకురానున్నారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ భేటీలో ఈ బిల్లుతో పాటు భూముల మార్కెట్ విలువల పెంపు, తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జూన్ 2న చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
పాఠశాలల్ని వ్యాపార కేంద్రాలుగా మార్చొద్దు
పాఠశాల ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్ని క్యాటగిరీలుగా విభజిస్తారు. పాఠశాల ఉన్న ప్రాంతం, అది ఎంత విస్తీర్ణంలో ఉంది, ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, క్రీడా సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. వర్గీకరణ చేశాక ఫీజుల్ని నిర్ణయిస్తారు. ‘ఏ’ క్యాటగిరిలోని పాఠశాలలకు ఎంత ఫీజు పరిమితి ఉండాలనేది నిర్దేశిస్తారు. అంతేకాకుండా ప్రతి ఏటా ఇష్టారాజ్యంగా కాకుండా.. వినియోగ ధరల సూచి ప్రకారమే ఫీజుల పెంపు ఉండేలా విధివిధానాలు ఉంటాయి. పాఠశాలల్ని వ్యాపార కేంద్రాలుగా మార్చడాన్ని నిషేధిస్తారు. అంటే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ, ఇతర పరికరాలు, వస్తువుల్ని పాఠశాల నుంచే కొనుగోలు చేయాలనడం కుదరదు అనే అంశాన్ని కూడా ఈ బిల్లులో పొందుపర్చారు. విద్యార్థులు ఆయా వస్తువుల్ని కొనడానికి ఆయా పాఠశాలల సమీపంలో ఉన్న మూడు దుకాణాల పేర్లను సూచించాలి. ఆ మూడింటిలో ఎక్కడ తక్కువ ధర ఇస్తే అక్కడ కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఇంకోవైపు రవాణా, భోజనం, విహారయాత్రల పేరుతో పాఠశాల లు అదనపు వపూళ్లు చేయడంపైనా పరిమితులు విధిస్తారు. వీన్నింటిపైనా మంత్రివర్గ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
భూముల విలువల పెంపుపైనా..
భూముల మార్కెట్ విలువల పెంపుపై క్యాబినెట్ సమావేశం చర్చించనుంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకున్నది. రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగు రోడ్డు లోపల గల ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో విలువలను పెంచే అవకాశముంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు సమీపంలో గల ప్రభుత్వ, పట్టా భూముల విలువలను కూడా ఇప్పుడున్న మార్కెట్ ధరల కంటే భారీ మొత్తంలో పెంచే ఆలోచనలో ఉంది. జిల్లాల్లోని పట్టణ భూముల విలువలు, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, నివాస ప్రాంతాల భూముల విలువలను పెంచనుంది. నగరాల్లోని అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు ప్రస్తుతమున్న విలువలనూ పెంచబోతోంది. ఏ ప్రాంతంలో ఎంత పెంచితే బాగుంటుందన్న అంశంపై క్యాబినెట్ కూలంకషంగా చర్చించనుంది. అయితే ఎప్పటి నుంచి భూముల విలువలను పెంచాలనేదానిపైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, భూముల కేటాయింపులు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.