క్రీడల్లో రాణించినా విద్యార్థులఉజ్వల భవిష్యత్తుకు భరోసా
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:39 AM
తెలంగాణలోని విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లో రాణించినా వారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
త్వరలో కొత్త క్రీడా విధానం.. అంతర్జాతీయ స్థాయిలో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి
రూ.800 కోట్లతో ప్రణాళిక.. గామాల నుంచి పట్టణ స్థాయి వరకు సీఎం కప్ పేరుతో పోటీలు
మెరికల్లాంటివారిని గుర్తించి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు శిక్షణ: సీఎం రేవంత్
హైదరాబాద్/రవీంద్రభారతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లో రాణించినా వారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నూతన క్రీడా విధానం తీసుకొస్తున్నామని, అటు ఆటలు, ఇటు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత చురుగ్గా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ స్థాయి స్టేడియంగా మార్చడానికి రూ.700 నుంచి రూ.800 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దాని ప్రకారం గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సీఎం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహించి, మెరికల్లాంటి వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపుతామని చెప్పారు. ఆదివారం రవీంద్ర భారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సభలో సీఎం మాట్లాడారు. క్రీడల్లో రాణించిన వారికి నగదు బహుమతులతో పాటు ఉద్యోగాలు ఇస్తున్నామని, నికత్ జరీన్, సిరాజుద్దీన్ దీనికి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి గ్రూప్ వన్ ఉద్యోగానికి కావాల్సిన డిగ్రీ విద్యార్హత సిరాజుద్దీన్‌కు లేక పోయినా ప్రత్యేక అనుమతితో ఆయనను డీఎస్పీని చేశామని సీఎం గుర్తుచేశారు. ఇటీవల విద్యార్థుల ప్రవర్తన, పోలీసులు నమోదు చేస్తున్న కేసులను పరిశీలిస్తుంటే కొంతమంది విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడుతున్నారని స్పష్టమవతుందన్నారు.
ఆయా పిల్లల తల్లిదండ్రులు తీరని వేదన అనుభవించే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, ఆటలవైపు మళ్లాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రజాప్రతినిధుల క్రీడా, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేవారని, గత 12 ఏళ్లుగా వాటికి దూరమయ్యామని, మంత్రుల సూచనతో వాటిని పునరుద్ధరించామని తెలిపారు. కాగా, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో ఎప్పుడూ బిజీగా ఉండే మన ప్రజాప్రతినిధులు కొద్దిసేపు రాజకీయాలను పక్కన పెట్టి మైదానంలో క్రీడాకారుల్లా, కళావేదికపై కళాకారుల్లా మారిపోయారు. శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా, సాంస్కృతిక పోటీల ముగింపు వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఫుట్‌బాల్‌లో సీఎం రేవంత్... ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో సీఎం టీమ్ విజేతగా నిలవగా, స్పీకర్ టీమ్ రన్నర్‌పగా నిలిచింది. క్రికెట్‌లో మూసీ టీమ్ విజేతగా నిలిచింది. మంజీరా టీమ్‌కు రన్నరప్ ట్రోఫీ దక్కింది. మంత్రి అజారుద్దీన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నారు. కబడ్డీలో మూసీ టీమ్ విజేతగా, మంజీరా టీమ్ రన్నర్‌పగా నిలిచాయి. ఈ పోటీల్లో మంత్రి వాకిటి శ్రీహరి ‘బెస్ట్ ప్లేయర్’ అవార్డు సొంతం చేసుకున్నారు. టగ్ ఆఫ్ వార్‌లో కాకతీయ టీమ్ విజయకేతనం ఎగురవేసింది. నెట్ గేమ్ వాలీబాల్‌లో టీమ్ కృష్ణ విజేతగా నిలిచింది.
