Share News

‘క్యూర్‌’కు కొత్త చట్టం.!

ABN , Publish Date - May 13 , 2026 | 04:18 AM

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధి మొత్తానికి ఒకే చట్టం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

‘క్యూర్‌’కు కొత్త చట్టం.!

  • 3 కార్పొరేషన్లలో ఒకేలా పన్నుల వసూలు, అనుమతులు

  • జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ

  • అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లు

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధి మొత్తానికి ఒకే చట్టం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను ప్రభుత్వం మల్కాజిగిరి, సైబరాబాద్‌, హైదరాబాద్‌ కార్పొరేషన్లుగా విభజించింది. అలాగే రాష్ట్రాన్ని కూడా క్యూర్‌(ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి ప్రాంతం), రేర్‌, ప్యూర్‌లుగా విభజించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ స్థానంలో ఏర్పాటైన మూడు కార్పొరేషన్‌లు అన్నింటికీ కలిపి ఒకే చట్టం అమల్లో ఉండేలా ప్రభుత్వం కొత్త చట్టానికి శ్రీకారం చుడుతోంది. అంటే క్యూర్‌ పరిధిలోని అన్ని కార్పొరేషన్లలో ఒకేలా పన్నులు వసూలు, అనుమతుల జారీ, ఇతర వ్యవహారాల నిబంధనలు ఒకేలా ఉండనున్నాయి. ఈ మేరకు క్యూర్‌ పరిధిలో తీసుకురాబోయే చట్టం అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారి మాణిక్‌రాజ్‌, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, మూడు కార్పొరేషన్‌ల కమిషనర్లు పాల్గొన్నారు. క్యూర్‌ పరిధిలో తీసుకురాబోయే కొత్త చట్టాన్ని ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టానికే సవరణ చేసి తీసుకురానున్నారు. దీంతో సవరణ బిల్లును పకడ్భందీగా రూపొందించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. మూడు కార్పొరేషన్‌ల పరిధిలో పన్నుల వసూలు, అనుమతులు సహా ఇతర వ్యవహారాలన్నీ ఒకే విధంగా ఉండేలా చట్టం ఉండాలని సూచించారు. కాగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - May 13 , 2026 | 04:18 AM