Share News

100 రోజుల్లో ఉద్యోగులకు బిల్లులు

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:25 AM

ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ 100 రోజుల్లో క్లియర్‌ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

100 రోజుల్లో ఉద్యోగులకు బిల్లులు

  • చెల్లించాలని క్యాబినెట్‌ నిర్ణయం.. అవసరమైతే ప్రజాప్రతినిధుల వేతనాల్లో 50 శాతం కట్‌ చేసి సర్దుబాటు

  • క్యాబినెట్‌ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ 100 రోజుల్లో క్లియర్‌ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి రూ.8 వేల కోట్లు, ఉద్యోగుల బిల్లులకు సంబంధించి రూ.6,200 కోట్లు.. మొత్తం రూ.14,200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని 100 రోజుల్లో చెల్లించేలా ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించింది. అలాగే.. సమ్మెను విరమించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన భేటీ.. రాత్రి 7.30 గంటల దాకా కొనసాగింది. అనంతరం.. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి క్యాబినెట్‌ సమావేశం వివరాలను విలేకరులకు వెల్లడించారు. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులను రూ.వేల కోట్ల మేర పెండింగ్‌లో పెట్టిందని.. తెలంగాణ ఏర్పడే నాటికి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని పేర్కొన్నారు. రిటైర్‌మెంట్‌ వయసు పెంచటంతో పాటు రిటైర్‌ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకపోవడంతో రిటైర్డ్‌ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వెంటనే వారి బకాయిల చెల్లింపునకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అవసరమైతే తమ జీతాలు, ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల నుంచి 50శాతం మొత్తాన్ని రిటైర్డ్‌ ఉద్యోగులకు సర్దుబాటు చేయడానికి మంత్రులందరూ ఉదారంగా ముందుకువచ్చారు. ఆర్థిక వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘాలు, బాధ్యులైన వారందరితో చర్చలు జరపాలని, వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే..


  • పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల(పీఏసీఎస్)కు నామినేషన్‌ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు అవుట్‌డోర్‌ స్టేడియం సామర్థ్యాన్ని 20 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించింది. స్విమ్మింగ్‌ పూల్‌ సామర్థ్యం పెంపుతో పాటు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాకారులకు వసతి, శిక్షణ సౌకర్యాలు కల్పించడానికి ఆమోదం తెలిపింది..

  • మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తిచేయాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మహాదేవ్‌పూర్‌, కాటారం, మల్హర్‌రావు, మహముత్తారం మండలాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు, 63 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుంది.

  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్క్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాగునీటి పారుదల శాఖకు చెందిన 85.10 ఎకరాలను మత్స్య శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై సీఎం ఆరా

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై కదిలిన జీఏడీ.. క్యాబినెట్‌ భేటీలోనూ చర్చ

‘‘ఖర్చు లేని సమస్యలూ పట్టవా’’ అనే శీర్షికతో.. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్‌ రెడ్డి దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించినట్లు సమాచారం. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్‌లోనూ చర్చజరిగింది. మరోవైపు సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులకు ఫోన్లు చేసి.. ఆర్థికేతర అంశాలు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి.. శాఖల వారీగా వివరాలు ఇవ్వాలంటూ అడిగినట్లు తెలిసింది. అయితే, ఆ వివరాలన్నీ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వచ్చాయని.. అవన్నీ క్లియర్‌ చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు అధికారులకు సూచించినట్లు తెలిసింది.

Updated Date - Apr 24 , 2026 | 04:25 AM