Cyber Crime Cell: వ్యక్తిత్వ హనన కథనాలపై సిట్
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:05 AM
మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననం, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోల మార్ఫింగ్ కేసుల విచారణకు సంబంధించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు...
సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు.. డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశాలు
ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ మార్ఫింగ్
ఫొటోను జతచేయడంపై నారాయణపేటలో కేసు
మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై
జయేశ్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్‌లో కేసు
ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా సిట్ ఏర్పాటు
అసత్య ప్రచారం వెనుక ఉన్న రిపోర్టర్, ఎడిటర్,
సంస్థ యాజమాన్యం గుర్తింపునకు దర్యాప్తు
హైదరాబాద్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననం, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోల మార్ఫింగ్ కేసుల విచారణకు సంబంధించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూపులో కావలి వెంకటేశ్ అనే వ్యక్తి సీఎం రేవంత్ ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసత్య కఽథనాన్ని పోస్టు చేశాడని, దీన్ని మరికొందరు షేర్ చేశారని నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీసుస్టేషన్‌లో ఈ నెల 11న కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు బీఎన్‌ఎ్‌స సెక్షన్లు 196(2),353(1)(ఏ), 352తో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఇదే విధంగా మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కొన్ని టీవీ చానళ్లు, యూట్యూబర్లు కథనాలను ప్రసారం చేశారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్‌రంజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 75,78,79,351(1),352(2) కింద కేసు నమోదు చేశారు. ఈ వార్తా కథనాన్ని ముందుగా ప్రసారం చేసిన ఎన్‌టీవీతో పాటు తెలుగు స్రైబ్, ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ తెలుగు, ఓల్గా టైమ్స్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ తెలుగు చానళ్లపై చర్యలు తీసుకోవాలని జయేశ్ రంజన్ తన ఫిర్యాదులో కోరారు.
మరోవైపు, మహిళా ఐఏఎస్ అధికారుల పట్ల అసభ్యకర వార్తలను ప్రసారం చేయడం గర్హనీయమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని అభిప్రాయపడ్డారు. మహిళా ఐఏఎస్ అధికారి పేరును నేరుగా వెల్లడించకుండా గతంలో ఆమె పనిచేసిన మూడు పోస్టులను కఽథనంలో చెప్పడం ద్వారా ఆమె గుర్తింపును సులభతరం చేశారంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలతో పాటు రెవెన్యూ ఇతర సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కథనాల వెనుక గుట్టు విప్పడానికి సిట్ అవసరమని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. అసలు ఈ కథనాన్ని ఎవరు రూపొందించారు.. ఎందుకు ప్రసారం చేశారన్న దానిపై సిట్ దర్యాప్తు చేయనుంది. కఽథనానికి బాధ్యులైన రిపోర్టర్, ఎడిటర్, సంస్థ యాజమాన్యం పాత్రను గుర్తించడానికి సిట్ అధికారులు రంగంలో దిగారు. ఈ కథనం ప్రసారం వెనుక కుట్ర ఉంటే కనిపెడతామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
సిట్‌లో ఉన్నదెవరంటే
సజ్జనార్ సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఎన్.శ్వేత సిట్ ఇన్‌చార్జిగా ఉంటారు. చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతం, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవిందబాబు, విజిలెన్స్‌లో అదనపు ఎస్పీ ప్రతాప్ కుమార్, ఈ కేసు నమోదు చేసిన సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఇన్‌స్పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్ సెల్ ఎస్సై పీ.హరీశ్ సిట్‌లో సభ్యులుగా ఉన్నారు.
విచారం వ్యక్తం చేసిన టీవీ చానల్ యాజమాన్యం
మహిళా ఐఏఎస్‌పై కథనాన్ని ప్రచారం చేసిన అంశంపై ప్రముఖ టీవీ చానల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. కథనం ప్రచారం వెనుక ఏదైన కుట్ర దాగి ఉందా అనేదానిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీస్ శాఖ సిట్ ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే సదరు టీవీ యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆ కథనం ఎవర్ని ఉద్దేశించింది కాదు. ఏ వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఈ కథనం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి మా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ప్రజాప్రతినిధుల పట్ల మాకు గౌరవం ఉంది. జరిగిన దానికి చింతిస్తున్నాం’’ అని ఆ టీవీ చానల్ ప్రకటించింది.