Share News

Harish Rao in Phone Tapping Case: ట్యాపింగ్‌ కేసులో హరీశ్‌ విచారణకు అనుమతివ్వండి

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:37 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ను విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Harish Rao in Phone Tapping Case: ట్యాపింగ్‌ కేసులో హరీశ్‌ విచారణకు అనుమతివ్వండి

  • సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్‌

న్యూఢిల్లీ, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ను విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ నాగరత్న నేతృత్వంలోని జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన దిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. హరీశ్‌రావు ఆదేశాల మేరకు పోలీస్‌ అధికారి రాధాకిషన్‌రావు తన ఫోన్‌ ట్యాప్‌ చేశారని ఆరోపిస్తూ 2024లో సిద్దిపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌ గౌడ్‌ పంజాగుట్ట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై 2024 డిసెంబరు 1న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ తర్వాత హరీశ్‌ పీఏ వంశీకృష్ణ సహా మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు తనపై అక్రమంగా కేసు పెట్టారని, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌ 2924 డిసెంబర్‌ 4న హైకోర్టును ఆశ్రయించారు. సుధీర్ఘ వాదనల అనంతరం హరీశ్‌పై కేసు పెట్టడానికి సరైన ఆధారాలు, బలమైన సాక్ష్యాలేమీ లేవంటూ హైకోర్టు 2025 మార్చి 4 ఆ కేసును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఛక్రధర్‌ గౌడ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం జస్టిస్‌ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణాలేమీ కనిపించడం లేదని అభిప్రాయపడింది. చక్రధర్‌ గౌడ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును పోలీసులు విచారించడం, రాష్ట్రంలో కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హరీశ్‌ను ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అందులో చక్రధర్‌ను సైతం ప్రతివాదిగా చేర్చింది. దీనిపైనే సుప్రీం విచారణ జరపనుంది.

Updated Date - Jan 05 , 2026 | 03:37 AM