ఆత్మగౌరవానికి పెద్దపీట
ABN , Publish Date - May 24 , 2026 | 05:20 AM
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితాలో పలు కులాల పేర్లను సవరిస్తూ గౌరవప్రదమైన ప్రత్యామ్నాయ పదాలను జోడిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీ కులాల జాబితా నుంచి వివక్ష పూరిత, అవమానకర పదాల తొలగింపు బీసీ జాబితాలో పలు కులాల పేర్లు సవరణ చేస్తూ ప్రభుత్వం జీవోల జారీ
హైదరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితాలో పలు కులాల పేర్లను సవరిస్తూ గౌరవప్రదమైన ప్రత్యామ్నాయ పదాలను జోడిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాజంలో కొన్ని కులాల పేర్లను అవమానకరంగా, దూషణలుగా వాడుతుండటం వల్ల ఆయా వర్గాల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు, వివక్షకు గురవుతున్నారనే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ సమర్పించిన నివేదికలు, మే 4న జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయా దేవి జీవోలు విడుదల చేశారు. ఈ సవరణ ప్రకారం ప్రత్యామ్నాయ పేర్లతో కొత్త కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ), జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆయా కులాల వారీగా మార్పులు ఇలా ఉన్నాయి.
దొమ్మర ఇక గడ వంశీయ.
బీసీ-ఏ గ్రూప్‌లో 7వ వరుస సంఖ్యలో ఉన్న ‘దొమ్మర’ అనే కులం పేరును ఇకపై ‘గడ వంశీయ’గా మారుస్తూ ప్రభుత్వం పూర్తిస్థాయి సవరణ చేసింది. రాబోయే రోజుల్లో వీరికి ‘గడ వంశీయ’ పేరుతోనే అధికారికంగా ధృవీకరణ పత్రాలు అందనున్నాయి.
‘పిచ్చిగుంట్ల పదం పూర్తిగా తొలగింపు..
బీసీ-ఎ గ్రూప్ సీరియల్ నెంబర్ 18లో ప్రస్తుతం ఉన్న ‘వంశరాజ్/పిచ్చిగుంట్ల అనే ఎంట్రీ నుంచి ‘పిచ్చిగుంట్ల’ అనే పదాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. 1995 నుంచి వాడుకలో ఉండి, సమాజంలో ఆమోదం పొందిన ‘వంశ రాజ్’ అనే పేరు మాత్రమే ఇకపై అధికారికంగా కొనసాగుతుంది.
బుడబుక్కలు ఇక శివ క్షత్రియ
బీసీ-ఏ గ్రూప్, వరుస సంఖ్య 4లో ఉన్న ‘బుడబుక్కల’ కులానికి అదనంగా ‘శివ క్షత్రియ’ అనే పదాన్ని ప్రత్యామ్నాయ పేరుగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. పేరు మార్చాలని ఒక వర్గం కోరగా, చారిత్రక నేపథ్యం దృష్ట్యా పాత పేరును అలాగే ఉంచాలని మరికొందరు పెద్దలు కోరారు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఇకపై ఈ ఎంట్రీని ‘బుడబుక్కల, శివ క్షత్రియ’గా మార్చారు. దరఖాస్తుదారుల అభ్యర్థన మేరకు ఈ రెండు పేర్లలో దేనితోనైనా కుల సర్టిఫికెట్ జారీ చేయవచ్చు.
రజక, చాకలి జాబితాలోకి ‘ధోబీ’... ‘వన్నార్’ తొలగింపు..
బీసీ-ఏ గ్రూప్, సీరియల్ నెంబర్ 5లో ఉన్న ‘రజక(చాకలి, వన్నార్)’ ఎంట్రీలో కీలక మార్పులు జరిగాయి. సమాజంలో ఈ సామాజిక వర్గాన్ని విస్తృతంగా ‘ధోబీ’ అని పిలుస్తుండటాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రజక, చాకలి పదాలకు సినోనిమ్‌గా ‘ధోబి’ అనే పదాన్ని చేర్చింది. వన్నార్’ అనేది స్థానిక కులం కానుందున ఆ పదాన్ని జాబితా నుంచి తొలగించింది. దీనివల్ల ఈ ఎంట్రీ ఇకపై ‘రజక, చాకలి, ధోబీ’గా మారుతుంది. అభ్యర్థుల కోరికమేరకు ఈ 3పేర్లలో దేనినైనా సర్టిఫికెట్ కోసం ఉపయోగించుకోవచ్చు.
‘వీరముష్టి’ ... ఇకపై ‘వీరభద్రీయ’
బీసీ-ఏ గ్రూప్, సీరియల్ నెంబర్ 23లో ప్రస్తు తం ఉన్న ‘వీరముష్టి (నెట్టికోటల), వీరభద్రీయ’ అనే ఎంట్రీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. చారిత్రక నేపథ్యం కోసం పాత పేరును ఉంచాలన్న కొందరి అభ్యర్థనను గౌరవిస్తూ, ఎంట్రీ క్రమాన్ని పూర్తిగా మార్చి ‘వీరభద్రీయ(వీరముష్టి, నెట్టికోటల),గా సవరించారు. దరఖాస్తుదారుల కోరిక మేరకు వీరభద్రీయ లేదా వీరముష్టి లేదా నెట్టికోటల పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
చిప్పొళ్లు (మేర) జాబితాలోకి ‘మేర’
బీసీ-డీ గ్రూపు సీరియల్ నెం.5లో ఉన్న ‘చిప్పొళ్లు(మేర) ఎంట్రీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ‘చిప్పోళ్లు’ అనే పదం చాలా అరుదుగా వాడుకలో ఉందని, అత్యధిక శాతం ప్రజలు మేర లేదా మేరు అనే పేర్లను వాడుతున్నారని బీసీ కమిషన్ గుర్తించింది. ఈ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపునిస్తూ, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ‘మేరు’ అనే పదాన్ని సినోనిమ్‌గా చేర్చారు. దీంతో ఈ ఎంట్రీ ‘మేర, మేరు, చిప్పోళ్లు’గా రూపాంతరం చెందింది. వీరు కూడా తమకు నచ్చిన పేరుతో సర్టిఫికెట్ పొందే వెసులుబాటు ఉంది.
’తమ్మలి‘ ఎంట్రీ నుంచి ‘శూద్రకాస్ట్’ తొలగింపు
బీసీ-డీ గ్రూప్, సిరియల్ నెంబర్ 29లో ఉన్న ‘తమ్మలి’ కులానికి సబంధించిన వివరణలో మార్పు జరిగింది. ఇప్పటి వరకు ఈ ఎంట్రీలో ‘తమ్మలి (నాన్-బ్రాహ్మిన్స్), (శూద్రకాస్ట్)..‘ అని ఉండేది. ‘నాన్-బ్రాహ్మిన్’ అనే పదాన్ని వృత్తిపరమైన వివరణను యథాతథంగా ఉంచుతూనే.. ‘శూద్రకాస్ట్’ అనే పదాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఇకపై ఈ ఎంట్రీ ‘29 తమ్మలి (నాన్-బ్రాహ్మిన్) (సాంప్రదాయకంగా సంగీత వాయిద్యాలు వాయించేవారు, పూల వ్యాపారం, దేవాలయ సేవల్లో సహాయం అందించేవారు-శివార్చకులు కానివారు)’ గా మారుతుంది.