సంచార జాతులకు సర్కారు వరం..
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:54 AM
రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార, విముక్త (డీనోటిఫైడ్) జాతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
దశాబ్దాల నిరీక్షణకు తెర.. విద్య ఉద్యోగాల్లో ప్రత్యేక గుర్తింపునకు బాటలు
రాష్ట్రంలో 51 బీసీ కులాలకు ‘సంచార, విముక్త తెగలు’గా గుర్తిస్తూ జీవో జారీ
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార, విముక్త (డీనోటిఫైడ్) జాతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న 51 వెనుకబడిన వర్గాల (బీసీ) కమ్యూనిటీలను అధికారికంగా ‘విముక్త, సంచార, అర్ధ సంచార తెగలు (డీఎన్‌టీ)’గా గుర్తిస్తూ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. బాలమాయా దేవి జీవో నంబర్ 10ని విడుదల చేశారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఆయా వర్గాల విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల అభివృద్ధికి ఈ నిర్ణయం సరికొత్త బాటలు వేయనుంది. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ సుదీర్ఘ అధ్యయనం అనంతరం అందించిన సమగ్ర నివేదిక, సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర క్యాబినెట్ ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న బీసీ ‘ఏ’, ‘బీ’, ‘సీ’, ‘డీ’, ‘ఈ’ గ్రూపుల జాబితాను తెలంగాణ ఆవిర్భావం తర్వాత యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈ సామాజిక వర్గాల్లో అత్యంత దయనీయ స్థితిలో ఉండి, సంచార జీవనం సాగిస్తున్న కమ్యూనిటీలను ప్రత్యేకంగా గుర్తించాలన్న వినతులపై కమిషన్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఈ తుది జాబితాను ఖరారు చేసింది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన 51 వర్గాల్లో అత్యధికంగా బీసీ-ఏ గ్రూపునకు చెందిన 49 కమ్యూనిటీలు ఉండగా, బీసీ-ఈ గ్రూపునకు చెందిన రెండు కమ్యూనిటీలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ప్రధానంగా బాలసంతు, బుడబుక్కల (శివ క్షత్రియ), దాసరి (భిక్షాటన చేసేవారు), గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాటిపాపల, మేదరి, పాముల, పార్థి, పాంబల, వీరభద్రీయ, వాల్మీకి బోయ, వడ్డెర (ఒడ్డె), మందుల, పరికముగ్గుల వంటి సంచార జాతులు ఉన్నాయి. మైనారిటీ వెనుకబడిన వర్గాలకు చెందిన ఫకీర్, బుద్బుడ్కి, గుడ్డి ఎలుగువాళ్లు, తురక, గంటి ఫకీర్ వంటి కమ్యూనిటీలు కూడా ఈ డీనోటిఫైడ్ (డీఎన్‌టీ) జాబితాలోకి చేరాయి. ఆయా తెగలకు కేంద్ర, రాష్ట్రాల ప్రత్యేక పథకాలు, నిధులు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్లందరికీ రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.