ఐదేళ్ల పదవీకాలంలోపు అర్హులందరికీ తులం బంగారం
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:25 AM
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, దాంట్లో భాగంగా తులం బంగారం పథకాన్ని కూడా తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
తెలంగాణలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం
కేరళ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, దాంట్లో భాగంగా తులం బంగారం పథకాన్ని కూడా తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కొంత ఆలస్యం జరిగినా అర్హులైన ప్రతీ ఒక్కరికీ తులం బంగారం ఇస్తామన్నారు. ప్రభుత్వ కాలవ్యవధి అయిన ఐదేళ్లలోపు అన్ని హామీల్ని తప్పనిసరిగా అమలుచేస్తామని, ఆ తర్వాతే ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున మంత్రి శ్రీధర్‌బాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని వివరించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎ్‌సలా ఉండవని, చెప్పింది తప్పకుండా చేసి చూపుతామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.