Share News

యాసంగి ధాన్యం సేకరణ 40 లక్షల టన్నులు

ABN , Publish Date - May 19 , 2026 | 05:18 AM

యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 5.50 లక్షల మంది రైతులకు కనీస మద్దతు....

యాసంగి ధాన్యం సేకరణ 40 లక్షల టన్నులు

  • 5.5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 6,556కోట్లు.. ఈ సీజన్‌లో 90లక్షల టన్నులు సేకరించే అవకాశం

  • గత ఏడాది రికార్డును తిరగరాయనున్న ప్రభుత్వం

  • ఐదేళ్ల ధాన్యం కొనుగోళ్ల లెక్కలు వెల్లడించిన సర్కారు

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 5.50 లక్షల మంది రైతులకు కనీస మద్దతు ధర కింద రూ.6,556 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 6.20 లక్షల టన్నులు, నల్లగొండ జిల్లాలో 5.51 లక్షల టన్నులు, కామారెడ్డి జిల్లాలో 3.03 లక్షల టన్నులు, సూర్యాపేటలో 2.70 లక్షల టన్నులు, పెద్దపల్లిలో 2.20 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ 5 జిల్లాల్లో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయని వివరించింది. మిగిలిన 27 జిల్లాల్లో(హైదరాబాద్‌ మినహా) ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, ఈ సారి రికార్డుస్థాయిలో ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 11 లక్షల టన్నుల సన్నధాన్యం, 29 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపింది. పీఏసీఎ్‌సలు నిర్వహిస్తున్న 4,455 కేంద్రాల్లో 24 లక్షల టన్నులు, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3,563 కేంద్రాల్లో 14 లక్షల టన్నులు, 557 ఇతర కొనుగోలు కేంద్రాల్లో 2 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు పేర్కొంది. కేంద్రాల వద్ద 18.6 కోట్ల గోనెసంచులు అందుబాటులో ఉంచామని, ధాన్యం రవాణాకు 12 వేల వాహనాలు వినియోగించామని వివరించింది.

గత ఐదేళ్లలో ఇలా..

గత ఐదేళ్లలో యాసంగి సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యం, రైతులకు చెల్లించిన సొమ్ము... తదితర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ లెక్కలు పరిశీలిస్తే... ఐదేళ్లలో గత ఏడాది (2024-25లో) కాంగ్రెస్‌ హయాంలో అత్యధికంగా 74.22 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. బీఆర్‌ఆర్‌ హయాంలో 2022- 23 యాసంగిలో సేకరించిన ధాన్యం 66.84 లక్షల టన్నులు కాగా, ఆ రికార్డును గత ఏడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరగరాసింది. ప్రస్తుత యాసంగిలో అంతకుమించి ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా... మరో 50 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఈ మేరకు మొత్తం 90లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే... గత ఏడాది రికార్డు కూడా తుడిచిపెట్టుకు పోనుంది. అదే సమయంలో రైతులకు చెల్లించే మొత్తం కూడా రూ.20 వేల కోట్లు దాటే అవకాశం ఉంది.

Updated Date - May 19 , 2026 | 05:18 AM