వాహనాలపై హోదా స్టిక్కర్లు వద్దు
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:35 AM
వాహనాలపై ప్రెస్, పోలీస్, అడ్వొకేట్, హ్యూమన్ రైట్స్ తదితర స్టిక్కర్లు వేసుకునే వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది.
అక్రెడిటేషన్ ఉంటేనే ప్రెస్ అని రాసుకోవాలి
రాష్ట్ర సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): వాహనాలపై ప్రెస్, పోలీస్, అడ్వొకేట్, హ్యూమన్ రైట్స్ తదితర స్టిక్కర్లు వేసుకునే వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. అనధికారికంగా ప్రభుత్వ చిహ్నాలు, వృత్తిపరమైన పేర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా సమాచార, పౌరసంబంధాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాహనాలపై అనధికారిక జెండాలు, చిహ్నాలు, స్టిక్కర్లు, లోగోలు వాడటం కేంద్ర మోటారు వాహన నిబంధన(1989)ల్లోని రూల్ 50, 51కి విరుద్ధమని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. వాహనాల నంబర్‌ప్లేట్లపై అనవసరపు రాతలు, స్టిక్కర్లు ఉంటే వెంటనే తొలగించాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి గుర్తింపు(అక్రెడిటేషన్) పొందిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ప్రెస్ అనే పదాన్ని ఉపయోగించాలి. గుర్తింపు లేకుండా ప్రెస్ స్టిక్కర్ వేసుకుని తిరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహన నంబర్ ప్లేట్లపై ‘ప్రెస్’ లేదా ఇతర పేర్లు రాయకూడదని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశించారు.