Share News

ధరణి అక్రమాలపై కఠిన చర్యలు

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:37 AM

రాష్ట్రంలో ధరణిలో జరిగిన అవకతవకలను వెలికి తీయడానికి మిగతా 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేపడతామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

ధరణి అక్రమాలపై కఠిన చర్యలు

  • మిగతా 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. భూ భారతితో పేద రైతుకు న్యాయం

  • రోవర్స్‌ టెక్నాలజీతో భూముల సర్వే

  • నాంపల్లి అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

  • ఖమ్మంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు పత్రాల పంపిణీ సభలో మంత్రి పొంగులేటి

ఖమ్మం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో ధరణిలో జరిగిన అవకతవకలను వెలికి తీయడానికి మిగతా 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేపడతామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఆడిట్‌ పూర్తి చేసిన కేరళ సంస్థ నివేదిక సమర్పించిందని, త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ ఆడిట్‌ చేపడతామన్నారు. తద్వారా పేదల భూమి పేదలకు దక్కేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఖమ్మం కలెక్టరేట్‌లో ఆదివారం లైసెన్స్‌డ్‌ సర్వేయర్లుగాగుర్తింపు పత్రాల పంపిణీ తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ప్రభుత్వం.. ధరణిని బంగాళాఖాతంలో పడేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి.. రైతన్నకు అండగా భూ భారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రతి పౌరుడికి ఆధార్‌ మాదిరిగానే ప్రతి రైతుకు భూధార్‌ అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. భూముల సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 5500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు నిష్పక్షపాతంగా పని చేసి రైతుల భూములకు భద్రత కల్పించాలన్నారు. భూ భారతితో ప్రతి రైతుకు భరోసా కల్పన కోసం రోవర్స్‌ టెక్నాలజీతో భూమి కొలతలతో సరిహద్దులను నిర్ణయిస్తామన్న పొంగులేటి.. ఇప్పటికే 600 రోవర్లను పంపిణీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో తొలి దశలో నక్షాలు లేని ఐదు గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని, ఇప్పుడు నక్షాలు లేని 413 గ్రామాల్లోనూ దశల వారీగా సర్వే చేసి.. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు నక్షాలు అందిస్తామని వెల్లడించారు. ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల ద్వారా సర్వే చేసి భూ ఆధార్‌ ఇవ్వనున్నట్లు పొంగులేటి తెలిపారు. ధరణి అక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ధరణిలో కలెక్టర్లకు అధికారమిస్తే.. భూ భారతి ద్వారా తహసీల్దార్‌, ఆర్డీవోలకు అధికారాలు కల్పించామని పొంగులేటి వివరించారు. భూ భారతి రిజిస్ట్రేషన్‌ ఫీజులో రూ.1000-రూ.15 వేల కోట్ల అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదంతా అవాస్తవమన్నారు. కేవలం రూ.3.90 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, దీనికి బాధ్యులైన వారిపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. నాంపల్లి అగ్ని ప్రమాదం దురదృష్టకరమన్న పొంగులేటి.. బాధితుల్లో ఒక్కో కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి తనకు ఫోన్‌ చేసి మాట్లాడారన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 03:37 AM