Share News

ఉద్యోగులకు ఆరోగ్య భరోసా

ABN , Publish Date - Jul 18 , 2026 | 05:53 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఫించనుదారులకు నగదు రహిత వైద్యాన్ని అందించే ‘న్యూ ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌’ అమలులోకి వచ్చింది.

ఉద్యోగులకు ఆరోగ్య భరోసా

  • అమల్లోకి ‘న్యూ ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌’

  • ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ

  • సభ్యులకు నగదు రహిత వైద్యం

  • పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

  • ఉద్యోగ నేతలకు హెల్త్‌ కార్డులు అందజేత

  • 886 ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వైద్యం

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఫించనుదారులకు నగదు రహిత వైద్యాన్ని అందించే ‘న్యూ ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌’ అమలులోకి వచ్చింది. శుక్రవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ డీడ్‌ను ఆవిష్కరించారు. హెల్త్‌ స్కీం వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించి, డౌన్‌లోడ్‌ చేసుకునే డిజిటల్‌ హెల్త్‌ కార్డులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత వ్యవస్థను అందించాలనే ఉద్దేశంతోనే ‘న్యూ ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌’ను తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చుల కోసం అప్పులపాలై, వాటిని తీర్చలేక సతమతమవుతున్న తీరును ప్రభుత్వం గమనించిందని, ఈ పరిస్థితిని మార్చటానికే నగదు రహిత వైద్య సేవలను ప్రారంభించామన్నారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి ఈ పథకమే నిదర్శనమని తెలిపారు. ఉద్యోగులు కుటుంబ సభ్యుల వంటివారేనని, వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారని భట్టి గుర్తు చేశారు. సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారిపై ఆధారపడిన 29.80 లక్షల మంది కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఉచిత ఇన్‌పేషెంట్‌ వైద్య సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఆరోగ్య పథకం ప్యాకేజీ రేట్లకు అనుగుణంగా 1816 రకాల వైద్య, శస్త్రచికిత్సలను ఈ పథకం కవర్‌ చేస్తుందని వివరించారు. ఆరోగ్య పథకం పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక ప్రత్యేక ‘ట్రస్ట్‌’ ను ఏర్పాటు చేశామన్నారు.


ఉద్యోగుల విజ్ఞప్తులపై గత పాలకుల నిర్లక్ష్యం

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఆరోగ్య భద్రత కోసం ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లభించలేదని భట్టి పేర్కొన్నారు. ఉద్యోగులు, ఫించనుదారులకు సంబంధించి గత ప్రభుత్వంలో పేరుకుపోయిన దాదాపు రూ.10 వేల కోట్ల బకాయి బిల్లులను తమ ప్రభుత్వం క్లియర్‌ చేస్తోందన్నారు. నెలకు రూ.రెండు వేల కోట్ల చొప్పున విడుదల చేస్తున్నామని వెల్లడించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేపథ్యంలో, ప్రతి ఉద్యోగి రెట్టింపు ఉత్సాహంతో, నిబద్ధతతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి పిలుపునిచ్చారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా ‘ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని’ రూపొందించామని మంత్రి తెలిపారు. అపోలో, యశోద, కిమ్స్‌, మెడికవర్‌, కామినేని, కాంటినెంటల్‌, కేర్‌, స్టార్‌, బసవతారకం వంటి ప్రముఖ కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు నగదు రహిత వైద్యసేవలు పొందే అవకాశం కల్పించామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ట్రస్ట్‌లో ప్రభుత్వం తరఫున 17 మంది, ఉద్యోగుల తరఫున 10 మంది, పెన్షనర్ల తరఫున ముగ్గురు సభ్యులు ఉండటం వల్ల పారదర్శకంగా పథకం అమలవుతుందని వివరించారు. మొత్తం ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ఔట్‌పేషెంట్‌ సేవలు అందుతున్నాయని, త్వరలో మరో 24 వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల ఐకాస చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా‌స్ రావు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం (టీజీటీఏ అనుబంధం) అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌ రెడ్డి, కార్యదర్శి గౌతంకుమార్‌, పెన్షనర్ల సంఘాలనేతలు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 05:54 AM