పౌరసేవల కోసం ప్రత్యేకంగా ‘క్యూర్1’
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:46 AM
నెల ప్రారంభమైందంటే చాలు... విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఆస్తి పన్నులు.. ఇలా ప్రతీ ఇంట్లోని వారు ఆయా పౌర సేవలకు సంబంధించిన బిల్లులను క్రమం తప్పకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిందే.
ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులు..
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు ఒకే యాప్
‘క్యూర్1’ను ప్రారంభించిన సీఎం రేవంత్
భవిష్యత్తులో యాప్‌లో మరిన్ని సేవలు
హైదరాబాద్ సిటీ, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): నెల ప్రారంభమైందంటే చాలు... విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఆస్తి పన్నులు.. ఇలా ప్రతీ ఇంట్లోని వారు ఆయా పౌర సేవలకు సంబంధించిన బిల్లులను క్రమం తప్పకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. ఇటీవల అందరూ ఆన్‌లైన్‌లోనే తమ బిల్లులు చెల్లించేస్తున్నారు. కానీ బిల్లుల చెల్లించేందుకు రకరకాల యాప్‌లను వినియోగిస్తున్నారు. ఆ యాప్‌ల నోటిఫికేషన్లతో విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘క్యూర్1’ అనే సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేరుకు తగ్గటుగానే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలో అంటే జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. క్యూర్ పరిధిలోని పౌరులు తమ ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లులు, నీరు, మురుగునీటి సదుపాయాల బిల్లులతోపాటు ట్రాఫిక్, ఇతర చలాన్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను క్యూర్1 యాప్‌లో చెల్లించవచ్చు. ‘ఒకే ప్రాంతం, ఒకే యాప్, అన్ని చెల్లింపులు’ అనే నినాదంతో రూపొందించిన ఈ క్యూర్1 యాప్‌ను ఉప్పల్ భగాయత్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని సేవలను ఈ యాప్‌లో అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా, ప్రజలు తమ మొబైల్ ఫోన్ నెంబరుతో క్యూర్1 యాప్‌లో రిజిస్టర్ అయిన తర్వాత ఆయా సర్వీసు నెంబర్లును నమోదు చేసుకొని తమకు చెందిన అన్ని బిల్లులను చెల్లించవచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడం వల్ల ప్రజలు వేర్వేరు వెబ్‌సైట్లు, యాప్‌లు వినియోగించాల్సిన అవసరం తప్పుతుందని అధికారులు పేర్కొంటున్నారు.