Share News

ఇక నిరాటంకంగా పరిషత్‌ ఎన్నికలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:31 AM

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు, వివాదాలు లేకుండా ప్రభుత్వం ‘తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టాని’కి సవరణను తీసుకొస్తోంది.

ఇక నిరాటంకంగా పరిషత్‌ ఎన్నికలు

  • అసెంబ్లీలో పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు, వివాదాలు లేకుండా ప్రభుత్వం ‘తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టాని’కి సవరణను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి ‘తెలంగాణ పంచాయతీరాజ్‌(మూడవ సవరణ) బిల్లు-2026’ను శనివారం శాసన సభలో ప్రవేశపెట్టింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలను ప్రతి 3నెలలకోసారి ఏడాదిలో 4సార్లు సవరిస్తుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు సవరించే తాజా జాబితాలనే పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాల సవరణల సందర్భంగా ఒక కటాఫ్‌ డేట్‌ను నిర్దేశించి, ఓటర్లు దరఖాస్తు చేసుకోవడానికి ‘తప్పనిసరి’గా అవకాశమివ్వాలి. అలా కటాఫ్‌ డేట్‌ పెట్టకుండా సవరణలను చేపట్టినట్లయితే ఓటర్లు తమకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వలేదంటూ కోర్టులకు వెళ్లే అవకాశాలు ప్రస్తుత పంచాయతీరాజ్‌ చట్టంలో ఉన్నాయి. ఫిర్యాదుదారు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని కోర్టులు ఎన్నికలను నిలిపివేయవచ్చు. ఇలాంటి ఆటంకాలు, కోర్టు వివాదాలు తలెత్తకుండా ఉండడానికి వీలుగా పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ తీసుకొస్తోంది. ఓటర్ల దరఖాస్తులు, విజ్ఞప్తులతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలను నిర్వహించుకునేలా సవరణ చేసింది.

Updated Date - Mar 29 , 2026 | 06:33 AM