Share News

ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌కు 1.5శాతం కట్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:39 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్యభద్రతకు సంబంధించిన ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)’ అమలు కోసం మార్గదర్శకాలను ...

ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌కు 1.5శాతం కట్‌

  • జీవో జారీ చేసిన ప్రభుత్వం

  • జూలై 15నుంచి ఈహెచ్‌ఎస్ అమలు.. మే నెల నుంచే కటింగ్‌ షురూ

  • భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనా, పెన్షనర్లైనా.. ఒక్కరికే కోత

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్యభద్రతకు సంబంధించిన ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)’ అమలు కోసం మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీరో జారీ చేసింది. ఇకపై ప్రతి ఉద్యోగి మూలవేతనం లేదా పెన్షనర్ల మూల పింఛను నుంచి ప్రతి నెలా 1.5శాతం మొత్తాన్ని ఈహెచ్‌ఎస్ హెల్త్‌ ఫండ్‌కు చందా కట్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ హెల్త్‌ స్కీమ్‌ను జూలై 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. మే నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల నుంచే ఈ కోత ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. తాజాగా సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ చందాల ద్వారా ఉద్యోగుల వాటాగా రూ.528 కోట్లు సమకూరనుండగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం ‘ఎంప్లాయిస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్టు’కు జమ చేయనుంది. ఇలా జమయ్యే రూ. 1,056 కోట్ల నిధులతో ఉద్యోగులకు ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు అందించనున్నారు. నిధుల కోత విధానంలో ఉద్యోగ సంఘాల నుంచి వ్యక్తమైన పలు సందేహాలకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చింది. భార్యాభర్తలిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు, లేదా వారిలో ఒకరు ఉద్యోగిగా ఉండి మరొకరు పెన్షనర్‌ అయితే.. ఒక్కరి జీతం నుంచే మాత్రమే సొమ్మును మినహాయిస్తారు. అలాగే, ఒక వ్యక్తి సర్వీసు పెన్షన్‌, కుటుంబ పెన్షన్‌(భర్త లేదా భార్య మరణాంతరం వచ్చేది).. ఇలా రెండు పింఛన్లు పొందుతున్నా కూడా ఒకే కోతకు నిబంధనలను పరిమితం చేశారు.

Updated Date - Jun 30 , 2026 | 04:39 AM