92 మంది ఖైదీలకు క్షమాభిక్ష
ABN , Publish Date - May 21 , 2026 | 03:07 AM
రాష్ట్ర ప్రభుత్వం 92 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష(రెమిషన్) ప్రసాదించింది. క్షమాభిక్ష కోసం ప్రభుత్వం పంపిన ఈ 92మంది ఖైదీల జాబితాకు గవర్నర్ శివప్రతాప్...
ఫైలుకు గవర్నర్ ఆమోదం
జూన్ 2న ఖైదీల విడుదల!
క్షమాభిక్ష పొందినవారిలో 86 మంది పురుషులు.. ఆరుగురు మహిళలు
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 92 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష(రెమిషన్) ప్రసాదించింది. క్షమాభిక్ష కోసం ప్రభుత్వం పంపిన ఈ 92మంది ఖైదీల జాబితాకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వం పంపిన క్షమాభిక్ష ప్రతిపాదనలపై గవర్నర్ బుధవారం ఉదయం లోక్‌భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా, ఐజీ మురళీ బాబు హాజరయ్యారు. సమావేశం అనంతరం ప్రతిపాదిత జాబితాను గవర్నర్ ఆమోదించి ప్రభుత్వానికి పంపించారు. వీరిలో 86 మంది పురుష ఖైదీలు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. గవర్నర్ ఆమోదం తెలిపిన ఫైల్ ప్రభుత్వానికి చేరింది. అయితే, ఖైదీల విడుదలకు ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఖైదీలు జైళ్ల నుంచి విడుదల అవుతారు. తెలంగాణ అవతరణ దినోత్సవం(జూన్ 2) రోజున ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, జూన్ 2న 213 మంది ఖైదీలకు ప్రత్యేక రెమిషన్ మంజూరు చేసింది. వీరిలో 178 మంది పురుషులు, 35 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.