తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ
ABN , Publish Date - May 16 , 2026 | 04:24 AM
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారి సేవలు, త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
చైర్మన్‌గా కె.కేశవరావు, సభ్యులుగా పొన్నం, కోదండరామ్, అద్దంకి
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారి సేవలు, త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, మోతె శోభన్‌రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా, మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. పలువురిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో... వారి సేవలను అధికారికంగా గుర్తించాలంటూ చాలాకాలంగా డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ముందుగా స్పష్టమైన ప్రమాణాలను రూపొందించడం కమిటీ ప్రధాన బాధ్యత. ఆ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేస్తుంది. అనంతరం వారికి ఎలాంటి గుర్తింపు, గౌరవం, సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.