Share News

ఐదు రోజుల పని విధానమే మేలు!

ABN , Publish Date - May 15 , 2026 | 05:04 AM

ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో తమకు వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని తెలంగాణ...

ఐదు రోజుల పని విధానమే మేలు!

  • ఉద్యోగులకు ఈ విధానం అమలుచేయాలి

  • వర్క్‌ఫ్రం హోమ్‌ దిశగా చర్యలు తీసుకోవాలి

  • సర్కారును కోరేందుకు సిద్ధమైన సంఘాలు

  • నేడు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్ర జ్యోతి): ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో తమకు వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. దీని వల్ల ఇంధన పొదుపు, విద్యుత్తు ఆదాతోపాటు కార్యాలయ ఖర్చులు.. ఉద్యోగుల వ్యక్తిగత ఖర్చు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇచ్చినా ప్రభుత్వానికి చాలావరకు ఖర్చు తగ్గుతుందని సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేష్‌ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని సీఎస్‌ రామకృష్ణారావుకువినతి పత్రం ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ విధానం వల్ల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులో సుమారు 15 నుంచి 20 శాతం ఆదా అవుతుందని చెబుతున్నారు. వారానికి రెండు రోజులు కార్యాలయాలు మూసివేయడం వల్ల విద్యుత్తు వినియోగం, ఏసీలు, విద్యుత్తు దీపాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. కార్బన్‌ ఉద్గారాల విడుదల కూడా తగ్గుతుందని అంటున్నారు. రోజువారీ పని గంటలు పెంచడం ద్వారా ప్రభుత్వ సేవల్లో జాప్యం లేకుండా చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు. కాగా, తెలంగాణ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత తొలిసారి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం జరుగుతుందని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు తెలిపారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యులుగా టీఎన్జీవో కేంద్ర సంఘం, టీజీవో, టీజీఎ్‌సఏ, పీఆర్‌టీయూ టీఎస్‌, ఎస్టీయూటీఎస్‌, ట్రెసా, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, యూటీఎఫ్‌, టీఆర్‌టీఎఫ్‌ ఉన్నాయి. రొటేషన్‌ పద్ధతిలో సభ్యులుగా ఉన్న సంఘాల జాబితాలో తెలంగాణ సచివాలయ అధికారుల సంఘం, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ తహసీల్దార్ల సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌, గవర్నమెంట్‌ జూనియర్‌ లెక్చర్ల సంఘం ఉన్నాయి.

Updated Date - May 15 , 2026 | 05:04 AM