ధరణి అక్రమాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:55 AM
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
పోర్టల్‌లో లొసుగుల ఆధారంగా స్కాంలు
చలానా కుంభకోణం.. వ్యవస్థాగత లోపం
అక్రమార్కులపై కఠిన చర్యలు: పొంగులేటి
కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్ర జ్యోతి): ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వ్యవస్థను గత పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరా చేసుకుని స్టాంప్ డ్యూటీ కుంభకోణాలకు పాల్పడినట్లు ఉన్నత స్థాయి విచారణ కమిటీ విచారణలో తేలింది. చలానా కుంభకోణం కేవలం సాంకేతిక లోపాల వల్ల జరిగిన పని కాదని, వ్యవస్థాగతంగా సృష్టించిన లోపమని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో బుధవారం ఉన్నతస్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. గత పాలకులు తెచ్చిన ధరణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ చేసిన సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. మానవ ప్రమేయంతో తప్పులు చేసేందుకు వీలుగా పోర్టల్ ఉందన్నారు. భూముల లావాదేవీలకు సంబంధించి.. అనుమానాస్పదంగా ఉన్న భూముల సమాచారం లభ్యం కాకుండా లాగిన్‌లు డిలీట్ చేశారని, అత్యంత రహస్యంగా ఉండాల్సిన లాగిన్ వివరాలను కనిపించకుండా చేశారని విచారణలో తేలిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూ లావాదేవీల వివరాలు అందుబాటులో లేకుండా చేశారని, ధరణి సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలపై కనీసం కోడ్ ఆడిట్ కూడా నిర్వహించలేదన్న విషయం ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగు చూసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తక్షణమే ధరణి పోర్టల్‌పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోర్టల్ నిర్వహణను గత పాలకులు టెర్రాసిస్ అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
అక్రమార్కులపై కఠిన చర్యలు..
సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ధరణి లోపాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్‌డ్యూటీ, రిజిస్ర్టేషన్ చార్జీలను కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసానూ వసూలు చేస్తామన్నారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో పొరపాట్లకు తావులేకుండా భూ భారతి పోర్టల్‌ను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించినట్లుగానే మిగిలిన జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేశ్‌కుమార్, సీఎంఆర్వో మకరంద్, రిజిస్ర్టేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.