మార్టిగేజ్ 5 శాతమే?
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:21 AM
భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నూతన నిబంధనలు రూపొందించాలని భావిస్తోంది.
భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులపై సర్కారు యోచన
తనఖా పెట్టే భూమి శాతం తగ్గించే చాన్స్
ప్రభుత్వానికి బిల్డర్ల విజ్ఞప్తులు
త్వరలోనే అమలులోకి కొత్త నిబంధనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్ర జ్యోతి): భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నూతన నిబంధనలు రూపొందించాలని భావిస్తోంది. అందుకోసం ఇప్పటికే పురపాలక శాఖ అధికారులు భవన బిల్డర్ల అసోసియేషన్ల అభిప్రాయాలు సేకరించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు భూమిలో 10 శాతాన్ని ప్రభుత్వానికి తనఖా పెట్టే నిబంధన ఉండగా, దానిని 5 శాతానికి తగ్గించాలని బిల్డర్లు ప్రతిపాదించినట్లు తెలిసింది. మౌలిక వసతుల ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో చెల్లించే మొత్తాలను మూలధన పెట్టుబడి కింద ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రోత్సాహకాల వల్ల నిర్మాణాల్లో వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రాజెక్టు పరిమానం, స్వభావాన్ని బట్టి దాని పూర్తికి 3 నుంచి 6 సంవత్సరాల వరకు సమయం ఇవ్వాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు. భవనంలోని ఫ్లోర్ల ఎత్తు పెంచుకునే అవకాశం కల్పించాలని బిల్డర్లు కోరినట్లు సమాచారం. దీనివల్ల గాలి, వెలుతురు మరింత లభించేలా ఆధునిక శైలి డిజైన్లతో భవనాలు నిర్మించే అవకాశం ఏర్పడుతుందని బిల్డర్ల అసోసియేషన్లు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. బాల్కనీ, సెట్‌బ్యాక్ నియమాల్లో సడలింపులు ఇవ్వడం ద్వారా వినియోగించుకునే స్థలం పెరిగి కొనుగోలుదారులకు విశాలమైన నివాసాలు పొందే వీలుంటుందని బిల్డర్లు సూచించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(ఓసీ) జారీ ప్రక్రియను సులభతరం చేయాలని, టీడీఆర్ బాండ్ల విషయంలో ముందస్తు జాప్యాన్ని నివారించాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే కొత్త భవన నిర్మాణ నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.