ఆందోళనక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంది
ABN , Publish Date - Mar 29 , 2026 | 07:27 AM
పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఎల్‌పీజీ గ్యాస్ విషయంలో వినియోగదారులెవరూ ఆందోళన చెందనవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
నియంత్రణలోనే పెట్రో ఉత్పత్తుల సరఫరా
కేంద్ర సమన్వయంతో సీఎన్‌జీ గ్యాస్ నెట్‌వర్క్ విస్తరణ
కేంద్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఎల్‌పీజీ గ్యాస్ విషయంలో వినియోగదారులెవరూ ఆందోళన చెందనవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇంధన సరఫరాపై పెరిగిన ఒత్తిడిని సమర్థవంతంగా నియంత్రించామన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురి, ప్రహ్లాద్ జోషి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధం ప్రభావంతో పెట్రోలియం ఉత్పత్తులు, గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరాపై పెరిగిన అపోహలతో ప్రజలు అయోమయానికి గురయ్యారన్నారు. ఒక్కసారిగా ప్రజల్లో పెరిగిన భయాందోళనలతో తాత్కాలికంగా ఏర్పడిన ఇబ్బందిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి పటిష్ఠ చర్యలు తీసుకుందని ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, డిమాండ్‌కు తగినట్లు గ్యాస్ సరఫరా అవుతుందన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంతోపాటు పంపిణీదారులతో సమీక్షిస్తున్నట్లు తెలిపిన ఉత్తమ్ కుమార్.. తమ రాష్ట్రంలో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఎల్‌పీజీ గ్యాస్ కేటాయింపులు పెంచాలని కేంద్ర మంత్రులను కోరారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపామన్నారు. అక్రమార్కులపై నిఘా పెంచి కేసులు నమోదు చేశామని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా నెట్‌వర్క్ విస్తరణకు ముందుకు వెళుతున్నామన్నారు. హైదరాబాద్‌లో భాగ్యనగర్ గ్యాస్ సంస్థ ద్వారా సీఎన్‌జీ గ్యాస్ సరఫరా విస్తరిస్తున్నట్లు వెల్లడించిన ఉత్తమ్.. జంట నగరాల్లో ఆటో లు, ట్యాక్సీలతోపాటు ప్రైవేటు వాహనాలకు సీఎన్‌జీ సరఫరాకు ఫిల్లింగ్ కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.