GHMC Expansion Approved: కార్పొరేషన్లకు ఓకే
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:18 AM
హైదరాబాద్ మహా నగరాన్ని ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారనేదానిపై నగరం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని....
పంచాయతీరాజ్, పురపాలక, జీహెచ్‌ఎంసీ చట్టాలను సవరించిన ప్రభుత్వం
మూడు బిల్లులకు శాసనసభ ఆమోదం
ఎమ్మెల్యేలతో మాట్లాడాకే కార్పొరేషన్ల సంఖ్యపై నిర్ణయం
విలీన మునిసిపాలిటీల్లో ప్రజలపై పన్నుల భారం ఉండదు
భవన నిర్మాణ అనుమతుల మీద కూడా భారం వేయబోం
మౌలిక వసతుల్లో అసమానతలు తగ్గించేందుకే విలీనం
శాస్త్రీయంగానే సరిహద్దుల నిర్ణయం.. ఆందోళన వద్దు
సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు, 360 డిగ్రీల కోణంలో మెట్రో
జీహెచ్‌ఎంసీ విలీనంపై సభలో మంత్రి శ్రీధర్‌బాబు
కోర్ అర్బన్ ఏరియాను ఆర్థిక జోన్‌గా గుర్తించినట్లు వెల్లడి
జీహెచ్‌ఎంసీ విస్తరణ అశాస్త్రీయంగా ఉంది
ప్రభుత్వానిది తొందరపాటు చర్య: ఎమ్మెల్యే అక్బరుద్దీన్
గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్తును తాకట్టు పెట్టేలా విస్తరణ
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శ
మునిసిపల్ సవరణ బిల్లులకు మండలి ఆమోదం
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్ర జ్యోతి): హైదరాబాద్ మహా నగరాన్ని ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారనేదానిపై నగరం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని, ఆ తర్వాతే తుది ప్రకటన చేస్తారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మౌలిక వసతుల్లో అసమానతలు తగ్గించేందుకు, ఓఆర్‌ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకే మునిసిపాలిటీల విలీనం చేపట్టినట్లు తెలిపారు. 2,053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో 12 జోన్లు, 60 సర్కిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆలోచనల మేరకే విలీన ప్రక్రియ జరిగిందన్నారు. జీహెచ్‌ఎంసీ విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం పంచాయితీరాజ్ చట్ట సవరణ, తెలంగాణ మునిసిపల్ చట్టం 2019 సవరణ, జీహెచ్‌ఎంసీ చట్టం 1955లో సవరణలు చేపట్టింది. 52 గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీల్లో కలపడం, 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం కోసం ఈ సవరణలను ప్రభుత్వం చేపట్టింది.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ వేర్వేరు చట్టాల పరిధిలో ఉండటంతో ప్రభుత్వం చట్టబద్ధత కల్పించేందుకు ఈ సవరణలు చేపట్టింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సవరణ ద్వారా ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలను పట్టణ పరిధిలోకి తీసుకొచ్చింది. కొన్ని పంచాయతీలను రద్దు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఆస్తులు, సిబ్బంది, నిధుల బదిలీకి చట్టసవరణ తప్పనిసరి కావడంతో ఈ ప్రక్రియను ప్రభు త్వం చేపట్టింది. ఇక 2019 తెలంగాణ మున్సిపల్ చ ట్టంలో సవరణ ఎందుకు చేశారంటే.. 27 మున్సిపాలిటీలకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల వివరాలను, 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తున్నందున వాటిని మున్సిపల్ చట్టం పరిధి నుంచి తొలగించేందుకు సవరణ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిని ఓఆర్‌ఆర్ వరకు విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆమేరకు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం చేసేందుకు, వాటి సరిహద్దులు, కొత్త జోన్ల ఏర్పాటు, సర్కిళ్ల పునర్‌వ్యవస్తీకరణకు, వార్డులు పెంచేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ చట్టం 1955లో సవరణలు చే సింది. గ్రామాలను పట్టణాలుగా, పట్టణాలను మెగా నగరంలో విలీనం చేసేందుకు చట్టపరమైన ఆటంకాలు ఎదురుకాకుండా మూడు చట్టాల్లో ప్రభుత్వం సవరణలు చేపట్టింది. చట్టసవరణ చేస్తూ శుక్రవా రం అసెంబ్లీలో మూడు బిల్లులు ఆమోదించారు. ఈ మేరకు తెలంగాణ పురపాలికల సవరణ బిల్లులు- 2025లను సభలో ప్రవేశపెట్టి, వాటి ప్రత్యేకతలను శ్రీధర్‌బాబు వివరించారు. నగరంలో గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉందని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏక్యూఐ 174 ఉందని తెలిపారు. దీన్ని తగ్గిస్తామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో పురపాలక శాఖ ప్రవేశపెట్టిన మునిసిపల్, జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లులపై సభ్యులు లేవనెత్తిన అంశా ల మీద, అభ్యంతరాల మీద సీఎం తరఫున మంత్రి శ్రీధర్‌బాబు వివరణ ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 78 లక్షల మంది జనాభా ఉంటే ఇవాళ 1.34 కోట్లకు పెరిగిందన్నారు. కోర్ అర్బన్‌లో రెండింతల జనాభా పెరిగిందని చె ప్పారు. ప్రస్తుత జనాభా అంచనాలు ప్రచురిస్తే న్యా యపరమైన ఇబ్బందులు ఉన్నందున.. 2011 జనా భా లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకునే జోన్లు, సర్కిళ్లు, డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. చాలా ప్రాంతాల్లో సరిహద్దుల నిర్ణయం మీద సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని.. దీనిపై శాస్త్రీయంగా ఆలోచించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయని.. ఒకట్రెండు సంవత్సరాల్లోనే ఆ ప్రాంతంలో కూడా జనసాంద్రత పెరుగుతుందనే కోణంలో జోన్లు, సర్కిళ్ల సరిహద్దులు నిర్ణయించామన్నారు.
కొంతమంది సభ్యులు 8 జోన్ల పేర్లు, జనాభా వ్యత్యాసం గురించి మాట్లాడారని.. తెల్లాపూర్ లాంటి చోట్ల రెండేళ్ల వ్యవధిలోనే జనాభా రెండింతలవుతుందన్నారు. సరిహద్దుల మార్పు కోరుతూ పేర్లు మార్చాలని 1127 సూచనలు వచ్చాయన్నారు. జీహెచ్‌ఎంసీలో మునిసిపాలిటీలను విలీనం చేశాక ఆయా ప్రాంతాల్లో పన్నులు పెరుగుతాయన్న ఆందోళన ఉందని సభ్యులు ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో ప్రజలమీద ఎలాంటి పన్నుల భారం ఉండబోదన్నారు. భవన నిర్మాణ అనుమతు లు, ఇతర పన్నుల విషయంలో ప్రజలపై భారం మోపే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. విలీన నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లో ఉండే వారికి కూడా మెట్రో రవాణాను విస్తరించేందుకు 360 డిగ్రీల కోణంలో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు మెట్రో నిర్వహణ సంస్థ అంగీకరించకపోవడంతో ప్రభుత్వమే మెట్రో బాధ్యతలను చేపట్టిందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు, ఇతరత్రా నగరంలో ఉన్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందన్నారు. ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతంలోని కోర్ అర్బన్ ఏరియాను ఆర్థిక జోన్‌గా ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు.
అశాస్త్రీయం: పాల్వాయి హరీ్‌షబాబు
మెరుగైన పాలన అందించాలంటే అధికారాలను వికేంద్రీకరించాలని, అలాకాకుండా కేంద్రీకృతం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అశాస్త్రీయం గా, ఏకపక్షంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీ్‌షబాబు అన్నారు. ఒక పార్టీకి(మజ్లిస్ పేరెత్తకుండా) లాభం చేకూర్చే విధంగా ఈ నిర్ణయం ఉందని, దీంతో ఆస్తి పన్ను పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా ఈ నిర్ణయం ఉందని తెలిపారు. వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని ఆయన డి మాండ్ చేశారు.
సమస్యలపై బ్లూప్రింట్ సిద్ధం చేసి ముందుకెళ్లాలి: కూనంనేని
గ్రేటర్ హైదరాబాద్‌లో అరగంట పాటు నిరాఘాటంగా వానలు కురిస్తే రహదారులన్నీ దిగ్భంధనం అవుతాయని, కొత్తగూడెం రోడ్లకన్నా అధ్వానంగా రోడ్లు ఉన్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పురపాలికలు చిన్నగా ఉంటేనే సమస్యలపై దృష్టి కేంద్రీకరించి, పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. సీవరేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ఒక బ్లూప్రింట్‌ను సిద్ధం చేసి, ముందుకెళ్లాలని కోరారు. తెలంగాణలో మూడో వంతు ప్రాంతాలు హైదరాబాద్‌లో కలిశాయని, జిల్లాలకు జిల్లాలే హైదరాబాద్‌లో చేరాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మారనుందన్నారు. పరిపాలన వికేంద్రీకరించాలంటే చిన్న ప్రాంతాలే మేలని సూచించారు.
మునిసిపల్ సవరణ బిల్లులకు మండలి ఆమోదం
వాడీవేడి చర్చల అనంతరం మునిసిపల్ సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ విస్తరణలపై ప్రవేశపెట్టిన రెండు బిల్లులను శానసమండలి ఆమోదించింది. శుక్రవారం సాయంత్రం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో మునిసిపల్ సవరణపై ప్రవేశపెట్టిన బిల్లులు 74వ రాజ్యాంగ సవర ణకు వ్యతిరేకమని బీఆర్‌ఎస్ సభ్యుడు దాసోజు శ్రవణ్ విమ ర్శించారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లు రాత్రికి రాత్రి జీహెచ్‌ఎంసీలో ఎలా కలుపుతారు? అని ప్రశ్నించారు. ఈ తతంగం చూస్తే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారేమోన న్న భయం కలుగుతోందన్నారు. హైదరాబాద్‌కు సమాంతరంగా ఎందుకు జిల్లాను అభివృద్ధి చేయడం లేదని నిలదీశారు. దీంతో సభలోనే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం చెబుతూ ప్రజాస్వామ్యయుతంగానే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పక్ష నేత మధుసూధనాచారి తదితరులు చట్టసవరణపై మాట్లాడిన అనంతరం బిల్లును ఆమోదించినట్టు ప్రకటించారు.
పావురాలతో లంగ్ ఇన్‌ఫెక్షన్ కేసులు: ఒవైసీ
జీహెచ్‌ఎంసీ విస్తరణ అశాస్త్రీయంగా ఉందని, ప్రభుత్వానిది తొందరపాటు చర్య అని ప్రతిపక్షాలతో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. పరిధిని పెంచినంత మాత్రాన నగరానికి గుర్తింపురాదన్నారు. నగరంలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, గాలి నాణ్యత దెబ్బతిన్నదని, ఏక్యూఐ 370కి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. పావురాలతో లంగ్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాను మూడు ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.