Share News

ఆరోగ్యానికి సాంకేతికత జోడించే వారికి అండగా ఉంటాం

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:25 AM

ఆరోగ్య రంగానికి సాంకేతికతను జోడించి నూతన ఆవిష్కరణలు చేసే వారికి తమ సర్కారు అండగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

ఆరోగ్యానికి సాంకేతికత జోడించే వారికి అండగా ఉంటాం

  • టెక్నాలజీతో మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు

  • ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్ర జ్యోతి): ఆరోగ్య రంగానికి సాంకేతికతను జోడించి నూతన ఆవిష్కరణలు చేసే వారికి తమ సర్కారు అండగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌ చెయిన్‌ వంటి కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌తో మారు మూల ప్రాంతాలకు వైద్య సౌకర్యాలను తీసుకెళ్లాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. సోమవారం టీ హబ్‌లో టచ్‌ ఏ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఏఏల్‌ హాస్పిటల్స్‌ హెల్త్‌ ఫెస్ట్‌-2026’లో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో హెల్త్‌ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్‌ ప్రొఫైల్‌ అందుబాటులోకి తెస్తామన్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. మహిళలందరికి ముందస్తు క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గ్లోబల్‌ మెడికల్‌ టూరిజం హబ్‌గా తెలంగాణను మార్చాలనే సంకల్పంతో ప్రత్యేక పాలసీ తెచ్చామని వివరించారు. అన్ని రంగాల్లో పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్‌ ఎక్సేంజ్‌ను ప్రారంభించామన్న దుద్దిళ్ల.. మార్కెట్‌ అవసరాలకు తగినట్లు రెడీ టు వర్క్‌ ఫోర్సును తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. మరో 4 నెలల్లో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ శాశ్వత ప్రాంగణాన్ని ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌ నగరానికి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు.

Updated Date - Feb 17 , 2026 | 06:26 AM