‘క్యూర్’ వాటర్‌బోర్డులో 965 పోస్టుల భర్తీ!
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:46 AM
రాజధానిలోని కోర్ అర్బన్ రీజియన్ పరిధి (క్యూర్)లో తాగునీటి సరఫరా చేస్తున్న వాటర్‌బోర్డులో 965 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం..
ప్రభుత్వ ఆమోదం.. టీజీపీఎస్సీ ద్వారా భర్తీకి ఏర్పాట్లు
హైదరాబాద్ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాజధానిలోని కోర్ అర్బన్ రీజియన్ పరిధి (క్యూర్)లో తాగునీటి సరఫరా చేస్తున్న వాటర్‌బోర్డులో 965 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే 230 వరకు ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా వాటర్‌బోర్డులో క్షేత్రస్థాయిలో 735 పోస్టుల భర్తీకి అనుమతులిచ్చింది. వాటర్‌బోర్డు ప్రస్తుతం క్యూర్ పరిధిలోని మూడు రీజియన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లలో సేవలను అందిస్తోంది. వాటర్‌బోర్డులోని క్షేత్రస్థాయి సిబ్బందిలో ఎక్కువ మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో మెరుగైన సేవలు అందడం లేదనే అభిప్రాయాలున్నాయి. క్షేత్రస్థాయిలోని లైన్‌మెన్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, హెల్పర్లు, సూపర్‌వైజర్లు ఇలా దాదాపు వెయ్యి పోస్టులను మంజూరు చేయాలంటూ వాటర్‌బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం 735 పోస్టులను మంజూరు చేసింది. దీంతో ఇంజనీర్ల పోస్టులు 230, క్షేత్రస్థాయి ఉద్యోగాలు 735 కలిపి మొత్తం 965 కొలువులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు.