Share News

7,437 ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్‌!

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:44 AM

రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సర్కారు శుభవార్త చెప్పింది. పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, జైళ్లు...

7,437 ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్‌!

  • పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఎస్పీఎఫ్‌ శాఖల్లో కొలువులు

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సర్కారు శుభవార్త చెప్పింది. పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, జైళ్లు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్)విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ఒక్క పోలీసు శాఖలోనే 5 వేల పోస్టులు ఉన్నాయి. కొలువుల భర్తీకి సర్కారు ఆమోదం తెలపడంతో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. స్థానిక క్యాడర్‌ వారీగా పోస్టుల పంపిణీ, రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖలో 148 సివిల్‌ ఎస్సైలు, 29 రిజర్వ్‌ ఎస్సైలు, 23 ఏఎస్సైలు, 4,800 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే అగ్నిమాపక శాఖలో 790, జైళ్ల శాఖలో 223, ఎస్పీఎఫ్‌లో 1,424 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. అనంతరం ప్రిలిమినరీ రాత పరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష తదితర దశలు ఉంటాయి. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్షల సిలబస్‌, పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 03:44 AM