Deputy CM Bhatti Vikramarka: రూ.1.02 కోట్ల ప్రమాద బీమా
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:18 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అమలు కానుంది. ఉద్యోగులకు రూ.1.02 కోట్ల చొప్పున ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు
5.14 లక్షల మందికి ప్రయోజనం: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అమలు కానుంది. ఉద్యోగులకు రూ.1.02 కోట్ల చొప్పున ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చే ఉద్యోగులను సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుందని తెలిపారు. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అమలు చేసేందుకు గాను రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు పూర్తయ్యాయన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిలను కూడా ప్రతి నెలా క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామని భట్టి తెలిపారు. ఇప్పటికే సింగరేణి, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్‌కో పరిధిలోని ఉద్యోగులందరికీ రూ.కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. సింగరేణిలోని 38,000 మంది శాశ్వత ఉద్యోగులతో పాటు విద్యుత్తు సంస్థల్లో పని చేస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 5.14 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని భట్టి వివరించారు.