Share News

కులగణనలో గుర్తించిన కుటుంబాలన్నింటికీ బీమా

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:41 AM

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల(సీఈఈఈపీసీ)’ సర్వేలో గుర్తించిన కుటుంబాలన్నింటికీ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ వర్తిస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టతనిచ్చారు.

కులగణనలో గుర్తించిన కుటుంబాలన్నింటికీ బీమా

  • కుటుంబాలు వీధిన పడొద్దనే ఉద్దేశంతోనే: రేవంత్‌రెడ్డి

  • ఉద్యోగులకు బీమా దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయం: భట్టి

  • ఇద్దరు మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కులు

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల(సీఈఈఈపీసీ)’ సర్వేలో గుర్తించిన కుటుంబాలన్నింటికీ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ వర్తిస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఇంటి పెద్ద మరణంతో కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశంతోనే బడ్జెట్‌లో ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని యాదాద్రి-భువనగిరి డివిజన్‌లో గల మోత్కూరు సెక్షన్‌ పరిధిలో పని చేసిన అసిస్టెంట్‌ లైన్‌మన్‌ ఓర్సు సురేష్‌ 2025 సంవత్సరం అక్టోబర్‌ 10న, మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ సివిల్‌ విభాగంలో పని చేసిన ఆర్టిజన్‌ ముఖ్తార్‌ బేగ్‌ 2025 సంవత్సరం ఏప్రిల్‌ 19న విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించారు. వారిద్దరి కుటుంబ సభ్యులకు.. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సోమవారం రూ.కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు విద్యుత్తు శాఖ మంత్రిగా ముందుకు వచ్చినందుకు భట్టి విక్రమార్కను సీఎం అభినందించారు. విద్యుత్తు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ చేపట్టామన్నారు. కాగా.. దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యుత్తు, సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి చొప్పున ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. తర్వాత ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపజేస్తూ రూ.1.20 కోట్లకు పెంచామని.. ఇదో చరిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 05:41 AM