Share News

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:04 AM

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్‌వాడీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం...

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట

  • స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన వారిని తిరిగి విధుల్లోకి చేరే చాన్స్‌

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్‌వాడీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతంలో రాజీనామా సమర్పించి, ఆ ఎన్నికల్లో పరాజయం పాలైన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెట్టుకునే అప్పీళ్లను(పునర్నియామక దరఖాస్తులను) అధికారులు పరిశీలిస్తారు. అయితే.. ఇక్కడ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిబంధనను విధించింది. సదరు అంగన్‌వాడీ సిబ్బంది రాజీనామా చేసిన స్థానాల్లో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఆ పోస్టు ఖాళీగా ఉంటేనే.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఈ మేరకు గత (2013, 2015 నాటి) మార్గదర్శకాలే వర్తిస్తాయని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనేక మంది అంగన్‌వాడీ సిబ్బంది కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నిండనున్నాయని తెలిపారు. అర్హత గల వారి దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరిత గతిన పరిశీలించి, వీలైనంత వేగంగా పునర్నియామక ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Updated Date - Jun 14 , 2026 | 04:04 AM