విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ
ABN , Publish Date - May 27 , 2026 | 04:26 AM
విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలియజేసింది.
సమ్మతి తెలుపుతూ హోంశాఖ నోటిఫికేషన్
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ హోంశాఖ కార్యదర్శి శిఖా గోయల్ నోటిఫికేషన్ జారీ చే శారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్‌ల నిర్మాణంపై తీసుకున్న నిర్ణయాల్లో తప్పిదాలు చోటుచేసుకున్నాయని, దీనిపై జస్టిస్ లోకూర్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరాలని ఇటీవల మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాన్ని అనుసరించి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ హోంశాఖకు లేఖ రాశారు. దాని ఆధారంగా హోంశాఖ నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ... కాలం చెల్లిన సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతోనే భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని దానివల్ల వచ్చే పాతికేళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.9 వేల కోట్ల నిర్వహణ భారం అధికంగా పడుతుందని జస్టిస్ లోకూర్ కమిషన్ తేల్చింది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోనూ రూ.3,642 కోట్ల నష్టం జరిగిందని తెలిపింది. అప్పట్లో పోటీ బిడ్డింగ్‌కు వెళ్లడం వల్ల కేరళకు యూనిట్ కరెంట్ రూ.3.60లకే లభించిందని గుర్తు చేసింది.ఛత్తీస్‌గఢ్ ఒప్పందం మేరకు కరెంట్ ఇవ్వకపోవడంతో బహిరంగ విపణిలో కొన్న విద్యుత్ వల్ల రూ.2 వేల కోట్ల అదనపు భారం పడిందని కమిషన్ తేల్చింది. ఛత్తీస్‌గఢ్ ఇచ్చిన కొద్ది కరెంటుకు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా వడ్డీలు/పెనాల్టీల రూపంలో రూ.750 కోట్లు చెల్లింపులు చేశారని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ కరెంటు తెచ్చుకోవడానికి పవర్ గ్రిడ్ కారిడార్ బుక్ చేసుకుంటే వాడుకోకపోయినా రూ.635 కోట్లు చెల్లించామని తెలిపింది. గోదావరి ఒడ్డున నీళ్లతో పాటు బొగ్గు నిల్వలు ఉన్నాయని, అక్కడే థర్మల్ ప్లాంట్లు కట్టాలని కేంద్ర విద్యుత్ అథారిటీ(సీఈఏ) చెప్పినా వినకుండా గనులకు 280 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి ప్లాంట్ చేపట్టారని, దీనివల్ల ఏటా రవాణా ఖర్చే రూ.1600 కోట్లు ఉంటుందని కమిషన్ గుర్తించింది.
విచారణకు దూరంగానే కేసీఆర్
కేసీఆర్‌పై అభియోగాలు మోపిన వారిని ప్రశ్నించడానికి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ అనుమతి ఇస్తూ కేసీఆర్‌కు నోటీసులు పంపింది. విచారణ రాజకీయ ప్రేరేపితమంటూ కేసీఆర్ కమిషన్‌కు లేఖ రాశారు. విచారణ పూర్తి చేయకుండానే వ్యాఖ్యలు చేశారంటూ విచారణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని తప్పిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో జస్టిస్ లోకూర్‌కు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఆయన కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులెవరిని పిలవకుండానే కేసీఆర్ రాసిన లేఖనే ప్రామాణికం చేసుకొని నివేదిక ఇచ్చి, వెళ్లిపోయారు. ఈ నెల 23న మంత్రివర్గ సమావేశంలో సీబీఐ దర్యాప్తు కోరాలని, అందుకు అవసరమైన లాంఛనాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. దానికి కొనసాగింపుగా సోమవారం ఇంధన శాఖ లేఖ, మంగళవారం హోంశాఖ నోటిఫికేషన్ వచ్చాయి. సీబీఐ దర్యాప్తునకు కేసీఆర్ సహకారం అందిస్తారా? లేక సుప్రీంకోర్టుకు వెళ్తారా? తేలాల్సి ఉంది. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావుకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ఉపక్రమించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.