ప్రతి క్వింటాల్ బియ్యం రాబడతాం
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:54 AM
రాష్ట్రంలో దశాబ్దకాలంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పక్కదారి పట్టిస్తూ.. ప్రభుత్వానికి బకాయిలు ఎగ్గొడుతున్న డిఫాల్ట్ మిల్లర్లను ఉపేక్షించేది లేదని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
కస్టమ్ మిల్లింగ్ బకాయిలన్నీ వసూలు చేస్తాం
డిఫాల్టర్ మిల్లర్ల ఆస్తులు జప్తు చేసి క్రిమినల్ కేసులు పెడతాం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దశాబ్దకాలంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పక్కదారి పట్టిస్తూ.. ప్రభుత్వానికి బకాయిలు ఎగ్గొడుతున్న డిఫాల్ట్ మిల్లర్లను ఉపేక్షించేది లేదని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వారి నుంచి ప్రతి క్వింటాల్ బియ్యాన్ని, చివరి రూపాయి బకాయిని వసూలు చేసి తీరతామన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 10-12 సంవత్సరాలకు సంబంధించి జిల్లాలు, మిల్లుల వారీగా డిఫాల్టర్ల జాబితాలను సిద్ధం చేసి ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఇన్నాళ్లూ మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వకపోవడం, ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకోవడం, కోర్టుల్లో కేసులు వేయడంతో ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక, పరిపాలనా సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చర్యలను వేగవంతం చేయడమే కాకుండా వారి స్థిర, చరాస్తులను వెంటనే జప్తు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తీవ్రమైన అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వారి బ్యాంక్ గ్యారెంటీలు, సెక్యూరిటీలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. డిఫాల్టర్లను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ కదలికలను టెక్నాలజీ ఆధారంగా పర్యవేక్షించడంతో పాటు, ఆకస్మిక తనిఖీల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ రూపొందిస్తున్నామని చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ డీఎస్ చవాన్‌తో పాటు శాఖ ఉన్నతాధికారులు, ఫూఐనాన్స్, లీగల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.