బాధ్యతాయుత ఓటింగ్‌తోనేప్రజాస్వామ్యం బలపడుతుంది
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:38 AM
బాధ్యత, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..
తెలంగాణలో ఓటర్లు 3.39 కోట్లకు చేరారు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
రవీంద్రభారతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): బాధ్యత, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది థీమ్ ‘‘నా భారత్- నా ఓటు’’ పౌరులే భారత ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువని స్పష్టంగా తెలియచేస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘానికి కల్పించిన స్వతంత్రత, నిష్పక్షపాతమైన స్వేచ్ఛాయుత, న్యాయసమ్మతం ఎన్నికలకు పునాది అన్నారు. అంబేడ్కర్, మహాత్మాగాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, అర్హులైన ఓటర్లకు హోం ఓటింగ్, ఆధునిక సాంకేతిక వినియోగం ద్వారా ఎన్నికలు మరింత సమగ్రంగా మారాయని ప్రశంసించారు. జూబ్లీహిల్స్ (61) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను డ్రోన్ నిఘా, పోలీసు సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించిన తీరును ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందుకోసం 35,895 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లలో 1.68 కోట్ల మంది పురుషులు, 1.70 కోట్ల మంది మహిళలు, 2890 మంది ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారని చెప్పారు. గత జాతీయ ఓటర్ల దినోత్సవం నుంచి ఇప్పటివరకు సుమారు 3.93 లక్షల మంది కొత్త ఓటర్ల జాబితాలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఓటరు జాబితా సవరణ లక్ష్యం నిజమైన ఓటర్ల తొలగింపు కాదని, రెండు చోట్ల ఉన్న ఓటర్లు, అనర్హులను తొలగించడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణికుముదిని, అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.