రైజింగ్ దిశగా దృఢమైన అడుగులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:31 AM
తెలంగాణ రైజింగ్ -2047 విజన్ లక్ష్యాన్ని అందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకెళ్తోందని .....
సమగ్ర, స్థిర అభివృద్ధికి ఇది రోడ్‌మ్యాప్.. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యం
ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వం
రాష్ట్ర సమతుల అభివృద్ధి కోసం కోర్, ప్యూర్, రేర్ మండలాలుగా విభజన
వరిని ఎగుమతి చేసే స్థాయికి వ్యవసాయం
రెండేళ్లలో 62,749 ఉద్యోగాల భర్తీ
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్ -2047 విజన్ లక్ష్యాన్ని అందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకెళ్తోందని చెప్పారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ.. ేస్వచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం రాజ్యాంగ మూల స్తంభాలని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజల చేత, ప్రజల కోసమే నడిచే వ్యవస్థ ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రజా ప్రభుత్వం, రెండేళ్లలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని గవర్నర్ కొనియాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించేలా ‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు. సమగ్ర, స్థిరమైన అభివృద్థికి స్పష్టమైన రోడ్‌మ్యా్‌పను రూపొందించిందన్నారు. వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే, ఈ డాక్యుమెంట్ లక్ష్యమని తెలిపారు.
రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం
ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని కోర్, ప్యూర్, రేర్ అనే మూడు ఆర్థిక మండలాలుగా విభజించామని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. గాంధీ సరోవర్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, మెట్రో రెండో దశ, పారిశ్రామిక కారిడార్లు, వరంగల్-ఆదిలాబాద్ విమానాశ్రయాలతో తెలంగాణ అభివృద్థి పరుగులు తీస్తోందని వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, ‘జయ జయ హే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ప్రకటించడం వంటివి చారిత్రాత్మక నిర్ణయాలన్నారు. మేడారం జాతరకు శాశ్వత మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా పెంపు, ధాన్యం కొనుగోలు, సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు చేయుతనిస్తూ దేశంలోనే అధిక వరిని పండించే స్థాయికి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించామన్నారు. దాంతో ఫిలిప్పీన్స్ వంటి విదేశాలకు మన ధాన్యం ఎగుమతి చేసే స్థాయికెళ్లిందని తెలిపారు. భూ భారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం చూపామని, ఉద్యోగాల కల్పనలో భాగం గా గ్రూపు- 1, 2, 3, 4 నియామకాలు పూర్తి చేసి 62,749 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు. యువత కోసం డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ హబ్‌గా హైదరాబాద్ నగరం
మహిళా సాధికారత కోసం ఇందిరా మహిళా శక్తి మిషన్, ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి, గృహ జ్యోతి వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం, పేదలకు ఉచిత సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, సామాజిక న్యాయం కోసం కుల గణన, ఎస్సీ ఉపకుల వర్గీకరణ అమలు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు దావోస్ పర్యటన, లైఫ్ సైన్సెస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ప్రవేశపెట్టామని గవర్నర్ చెప్పారు.