Share News

లోక్‌భవన్‌లో ఘనంగా ఎట్‌ హోం!

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:30 AM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ లోక్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తేనీటి విందు ఇచ్చారు.

లోక్‌భవన్‌లో ఘనంగా ఎట్‌ హోం!

  • పలు రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు గవర్నర్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు

  • హాజరైన హైకోర్టు సీజే ఏకే సింగ్‌,

  • స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు, నేతలు

హైదరాబాద్‌/అల్వాల్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ లోక్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తేనీటి విందు ఇచ్చారు. జాతీయగీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైకోర్టు సీజే ఏకే సింగ్‌, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో పాటు ఆయన సతీమణి సుధాదేవ్‌ వర్మలు అతిథులను పలకరిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ‘గవర్నర్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’ కార్యక్రమంలో భాగంగా గతేడాదికి పలు రంగాల్లో స్వచ్ఛంద సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు. పేద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దు తూ.. మహిళా సాధికారతకు కృషి చేసిన కన్నెగంటి రమాదేవి (హైదరాబాద్‌)కి గవర్నర్‌ అవార్డు అందజేశారు. గోండు భాషను పునరుజ్జీవింపజేస్తూ మహాభారతాన్ని 4 నెలల్లో అనువదించి, 400 గిరిజన జానపద గీతాలు రచించడం ద్వారా గిరిజన సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన తోడసం కైలాస్‌ (ఆదిలాబాద్‌ జిల్లా, వాఘాపూర్‌).. గ్రామీణ పేదలకు కైలా్‌సనాథ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా తక్కువ ఖర్చుతో వైద్య సేవలందిస్తున్న డాక్టర్‌ ప్రద్యుత్‌ వాఘ్రే (హైదరాబాద్‌), సమాజ సేవలో కార్పొరేట్‌ బాధ్యతను బలోపేతం చేసిన వి.రాజన్న(హైదరాబాద్‌)కు గవర్నర్‌ అవార్డు లు ప్రదానం చేశారు. ఇక సంస్థల తరఫున.. గిరిజన మహిళలకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న శ్రీ సాయి సోషల్‌ ఎంపవర్‌మెంట్‌ సొసైటీ (ఘట్‌కేసర్‌), గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సేవలందిస్తున్న ఇండిజీనియస్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (కొత్తగూడెంజిల్లా, గట్టుమల్ల), గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సేవలందిస్తున్న రామదేవ్‌రావు హాస్పిటల్‌ (హైదరాబాద్‌), మహిళల ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వైద్య శిబిరాలు, విపత్తు సహాయ సేవలు అందిస్తున్న గివ్‌ ఫర్‌ సొసైటీ (ఘ ట్‌కేసర్‌)లకు గవర్నర్‌ అవార్డులు ప్రదానం చేశారు. ప్రతి అవార్డుకు 2 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు.

Updated Date - Jan 27 , 2026 | 03:30 AM