ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:21 AM
ప్రభుత్వ సిఫారసుతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా నామినేట్ చేసిన కోదండరాం, మంత్రి అజారుద్దీన్‌లను శాసనమండలి సభ్యులు ...
గవర్నర్ కోటాలో నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడదల
నేడు ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం
హైదరాబాద్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సిఫారసుతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా నామినేట్ చేసిన కోదండరాం, మంత్రి అజారుద్దీన్‌లను శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదివారం నుంచి ఆరేళ్లపాటు వీరు ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నట్లు తెలిపింది. అయితే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది. తుది తీర్పు ప్రభుత్వానిఅనుకూలంగా వస్తే వీరి సభ్యత్వాలకుఎలాంటి ప్రమాదం ఉండబోదని శాసనమండలి వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గవర్నర్ కోటాలోని ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లు 2023, మే 27నే ఖాళీ అయ్యాయి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ సీట్ల కోసం బీఆర్‌ఎ్‌సపార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా.. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు కోర్టును ఆశ్రయించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు సీట్లకు కోదండరాం, అమెర్ అలీఖాన్‌ల పేర్లను ప్రతిపాదించింది. గవర్నర్ ఆమోదంతో కొద్ది నెలల పాటు వారు ఎమ్మెల్సీలుగా కొనసాగారు. అయితే, ఎమ్మెల్సీలుగా వీరి నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి.. తాజా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఆ సూచన మేరకు కోదండరాం పేరును కొనసాగిస్తూ.. అమెర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రభుత్వం పంపింది. కేసు ఇంకా విచారణలో ఉండటంతో గవర్నర్ ఆ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టారు. తాజాగా కోర్టు చేసిన సూచన మేరకు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కొత్త గవర్నర్ శివప్రసాద్ శుక్లాను కలిసి వీరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కోరారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్.. కోదండరాం, అజారుద్దీన్‌లను శనివారం నామినేట్ చేశారు. దాని ఆధారంగా ఆదివారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోదండరాం నేడు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయం మంత్రి అజారుద్దీన్‌కు పెద్ద ఊరటనే ఇచ్చింది. ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఈ నెల 30 నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. ఆలోపు చట్టసభల్లో ఆయన సభ్యుడు కాకపోతే నిబంధనల ప్రకారం మంత్రి పదవిని కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ప్రభుత్వం గెజిట్ జారీచేయటంతో పదవీ గండం తప్పించుకున్నారు.