గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వీడ్కోలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:42 AM
తెలంగాణ గవర్నర్‌గా పనిచేస్తూ ఇటీవల మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయిన జిష్ణుదేవ్ వర్మకు ఆదివారం లోక్‌భవన్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
11ననూతన గవర్నర్ ప్రమాణం
గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ గవర్నర్‌గా పనిచేస్తూ ఇటీవల మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయిన జిష్ణుదేవ్ వర్మకు ఆదివారం లోక్‌భవన్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొని గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో జిష్ణుదేవ్ వర్మ లోక్‌భవన్‌లోని ప్రతి అధికారి, సిబ్బందిని వ్యక్తిగతంగా కలుసుకుని తన పదవీకాలంలో అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా నూతన గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా ఈ నెల 11న పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చని తెలుస్తోంది. కాగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోక్‌భవన్‌కు వెళ్లి బదిలీపై వెళ్తున్న జిష్ణుదేవ్‌వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకుని వీడ్కోలు తెలిపారు. జిష్ణుదేవ్‌వర్మను లోక్‌భవన్‌లో మంత్రి సీతక్క కూడా ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సమ్మక్క-సారలమ్మ జాతర జ్ఞాపికను, ఆయన సతీమణికి తెలంగాణ సంప్రదాయ చీరను మంత్రి బహూకరించారు. మంత్రి సీతక్క సేవలను గవర్నర్ ప్రశంసించారు. జిష్ణుదేవ్ వర్మ మూడుసార్లు ములుగులో పర్యటించారని సీతక్క గుర్తుచేశారు. పలు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి మహిళల ఆర్థికాభివృద్థికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని కొనియాడారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో కొండపర్తి గ్రామ మహిళాసంఘం సభ్యులు ఇప్పపువ్వు లడ్డూల తయారీని ఉపాధిగా ఎంచుకున్నారన్నారు.