లోక్‌భవన్‌లో ఎట్ హోమ్
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:22 AM
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో శనివారం సాయంత్రం ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గవర్నర్ తేనీటి విందుకు సీఎం రేవంత్, హైకోర్టు చీఫ్ జస్టిస్ హాజరు
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో శనివారం సాయంత్రం ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకీ శుక్లా అతిథులకు తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌కుమార్, కమిషనర్లు సజ్జనార్, రమేష్ రెడ్డి, సుమతీ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ,ఎమ్మెల్యేలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విందులో పాల్గొన్నారు. కాగా, లోక్‌భవన్‌లో శనివారం ఉదయం నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. గాంధీ, నెహ్రూ, పటేల్, సుభా్‌షచంద్రబోస్ వంటి నాయకులను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.