కొత్త రుణాల సొమ్ము..పాత అప్పులకే సరి
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:43 AM
ఏళ్ల క్రితం చేసిన పాత అప్పుల అసలు, వడ్డీ చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందుతున్నది చాలా తక్కువగా ఉంటోంది.
మార్కెట్ రుణాల చెల్లింపు కోసమే 58ు సొమ్ము వ్యయం
రాష్ట్ర అవసరాలకు మిగిలేది 42ు.. జీఎ్‌సడీపీలో 27ు దాటిన అప్పులు
2025-64 మధ్య కట్టాల్సిన అప్పుల అసలు రూ.3,63,883 కోట్లు
వివిధ కార్పొరేషన్లకు రూ.2.41 లక్షల కోట్ల గ్యారంటీ అప్పులు అదనం
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్‌బీఐ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల క్రితం చేసిన పాత అప్పుల అసలు, వడ్డీ చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందుతున్నది చాలా తక్కువగా ఉంటోంది. గత మూడేళ్ల సగటును తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాల్లో 58శాతం సొమ్ము పాత అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపుకే వెళ్లిపోయింది. రాష్ట్రానికి 42 శాతమే సొమ్ము అందింది. శుక్రవారం ‘రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, 2025-26 సంవత్సరపు బడ్జెట్‌లపై ఓ అధ్యయనం’ పేరిట రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెచ్చిన అప్పుల్లో 70 శాతం, 2024-25లో తెచ్చిన అప్పుల్లో 56శాతం, 2025-26లో తెచ్చిన అప్పుల్లో 49శాతం సొమ్మును పాత అప్పులు, వడ్డీలు తిరిగి చెల్లించడానికే వినియోగించింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరిట గ్యారంటీ అప్పులు చేసింది. 2025 మార్చి నాటికి సవరించిన అంచనాల ప్రకారం.. ఈ అప్పులు రూ.2,41,528 కోట్లకు చేరినట్ల్లు ఆర్‌బీఐ వెల్లడించింది. రాష్ట్ర స్థూల దేశీయోత్ప త్తి (జీఎ్‌సడీపీ)లో రాష్ట్ర అప్పుల శాతం పెరిగిపోతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర జీఎ్‌సడీపీలో అప్పులు 25 శాతానికి మించకూడదు. కానీ ఆ పరిమితి దాటుతున్నాయి. 2021లో 28.8శాతం, 2022లో 28శాతానికి చేరాయి. 2025-26లో రాష్ట్ర బడ్జె ట్ అంచనాల ప్రకారం జీఎస్డీపీలో అప్పులు 27.5శాతం వరకు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది.
2064 నాటికి చెల్లించాల్సిన అప్పుల అసలు.. రూ.3,63,883 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం గతంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సిన అప్పుల మొత్తం గణనీయంగా పెరగనుంది. 2025-64 మధ్యలో అప్పుల అసలు సొమ్మే రూ.3,63,883 కోట్లు కట్టాల్సి ఉందని, వడ్డీలు దీనికి అదనమని ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది.