Share News

సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:45 AM

ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి...

సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి

  • ఉద్యోగులతో చర్చలకు సర్కారు సిద్ధం

  • విలీనం, సంఘాల పునరుద్ధరణ అంశాలు తప్ప మిగతావన్నీ చర్చిద్దాం: పొన్నం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్థంగా ఉందని, తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణకు సంబంధించిన అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని, ఇవి తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి సిద్థంగా ఉన్నామని చెప్పారు. ఈ రెండు అంశాలు ఇప్పటికిప్పుడే తీసుకునే నిర్ణయాలు కాదని, అందువల్ల వాటి పరిష్కారానికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలులోకి తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశం కూడా ఆలోచిస్తున్నామన్నారు. విలీనం విషయంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై కమిటీ సమగ్ర అధ్యయనం అవసరమని, అందువల్ల చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పొన్నం ప్రభాకర్‌ కోరారు.

Updated Date - Apr 15 , 2026 | 04:45 AM