Share News

ఆరోగ్యం.. మరింత చేరువ

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:42 AM

రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానాన్ని తీసుకొచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది.

ఆరోగ్యం.. మరింత చేరువ

  • సర్కారు వారి సమగ్ర ఆరోగ్య సంరక్షణ

  • రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్‌ కేంద్రాల ఏర్పాటు

  • ప్రతి 25 కిలోమీటర్లకూ ఒక డయాలసిస్‌ కేంద్రం

  • ఈఎన్‌టీ, ఐ కేర్‌, మెంటల్‌ హెల్త్‌పై ప్రత్యేక దృష్టి

  • ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ను డిజిటైజ్‌ చేసే కార్యక్రమం

  • వృద్ధుల కోసం ప్రత్యేకంగా జెరియాట్రిక్‌ సేవలు

  • హైదరాబాద్‌ వాసులకు క్యూర్‌ హెల్త్‌ పాలసీ

  • 11 అంశాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యశాఖ

  • బడ్జెట్‌ సమావేశాల్లో ‘కొత్త ఆరోగ్య విధానం’

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానాన్ని తీసుకొచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది. స్పెషాలిటీ వైద్య సేవల కోసం పట్టణాలకు పరుగు తీయాల్సిన అవసరం లేకుండా.. ప్రజలకు చేరువలోనే ఆ సేవలు అందేలా ఒక విధానాన్ని రూపొందిస్తోంది. అందులో భాగంగా.. అత్యవసర వైద్యసేవలైన ట్రామా కేర్‌ నుంచి డయాలసిస్‌ వరకూ.. ఎక్కడికక్కడ అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇలా మొత్తం 11 అంశాలను గుర్తించి ఒక్కో దానికీ ఒక్కో పాలసీని రూపొందించి, వాటిన్నింటిని కలిసి ‘న్యూ హెల్త్‌ కేర్‌ పాలసీ’గా ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. ఆ 11 అంశాలలో డయాలసిస్‌, మానసిక ఆరోగ్యం, ట్రామా కేర్‌, చెవి, ముక్కు, గొంతు, ఆప్తాల్మాలజీ, డీ అడిక్షన్‌, క్యూర్‌ హెల్త్‌ పాలసీ, డిజిటల్‌ హెల్త్‌, పాలీ క్లినిక్‌, ఫర్టిలిటీ, జెరియాట్రిక్‌ సబ్జెక్టులున్నాయి. ఉదాహరణకు.. తెలంగాణవ్యాప్తం గా ఇప్పటివరకూ రెండు మూడు ట్రామాకేర్‌ కేంద్రాలుండగా.. ట్రామా కేర్‌ పాలసీలో భాగంగా ఆ కేంద్రాల సంఖ్యను ఓకేసారి 109కి పెంచబోతోంది. అలాగే డయాలసిస్‌ సేవలు ఇప్పటివరకూ జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకే పరిమితమ య్యాయి. కానీ ఇప్పుడు కిడ్నీ వైఫల్య కేసులు ఎక్కువగా సంభవిస్తోన్న ప్రాంతాలను గుర్తించడంతో పాటు ప్రతీ 25 కిలోమీటర్లకు ఒక రక్తశుద్ది కేంద్రా న్ని ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో యంత్రాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డయాలసిస్‌ పాలసీని తెస్తోంది. అలాగే ఆప్తాల్మాలజీ పాలసీలో భా గంగా రాష్ట్రవ్యాప్తంగా ఐకేర్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం మరో పాలసీని తీసుకువస్తున్నారు.


రాష్ట్రంలో పెరుగుతోన్న మానసిక ఆరో గ్య బాధితులను దృష్టిలో పెట్టుకొని మానసిక ఆరోగ్య వైద్య సేవల్ని పెంచబోతున్నారు. డిజిటల్‌ హెల్త్‌ పాలసీలో భాగంగా ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ను డిజిటైజేషన్‌ చేయనున్నారు. అంటే.. ఒక రోగి ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే ఆ వివరాలన్నీ పేషెంట్‌ పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆ పేషెంట్‌ ఏ ఆస్పత్రికి వెళ్లినా... ఒక యూనిక్‌ నంబరు ఆధారంగా సద రు రోగి వివరాలన్ని డాక్టర్లు ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకుని తదుపరి వైద్యసేవలకు సిఫారసు చేస్తారు. సంతానలేమి సమస్యతో బాధపడేవారి కోసం ఫెర్టిలిటీ పాలసీ తేబోతున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం బోధనాస్పత్రుల్లో 10 పడకలతో జెరియాటిక్ర్‌ వార్డులను ఇప్పటికే ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి కూడా ఒక పాలసీని ప్రభుత్వం తేబోతోంది. ఇక రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉండే వారికి క్యూర్‌ హెల్త్‌ పాలసీని తీసుకురాబోతున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఇలా ఈ 11 అంశాలపై రూ పొందించిన పాలసీ డాక్యుమెంట్‌ను వైద్యశాఖ సీఎం వద్దకు పంపనుంది. ఈ మేరకు అన్ని అంశాలపై డాక్యుమెంట్లను రూపొందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవలే ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చోంగ్థు ఆ శాఖ విభాగాధిపతులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

ఎలా ఉండాలి? ఖర్చెంత?

వైద్యశాఖలోని అయా విభాగాధిపతులు, కీలక అధికారులకు పాలసీ డాక్యుమెంట్స్‌ను రూపొందించే బాధ్యతలను హెల్త్‌ సెక్రటరీ అప్పగించారు. ఒక్కొ పాలసీకీ.. ఆ రంగంలో విశేష అనుభవమున్న, నిష్ణాతులైన వైద్య నిపుణులను రంగంలోకి దించారు. ప్ర స్తుత విధానం ఎలా ఉంది? కొత్త పాలసీ ఏ విధం గా ఉండాలి? మానవ వనరుల అవసరం ఏ మేరకు ఉంటుంది? కొత్త పాలసీతో సర్కారుపై అదనంగా ఎంత భారం పడుతుంది? ప్రజలకు అందే వైద్యసేవలేంటి? అలాగే ఏయే మౌలిక సదుపాయాలు కల్పించాలి తదితర అంశాలపై సంబంధిత నిపుణులు కసరత్తు చేస్తున్నారు. వారు సమగ్రంగా రూపొందించిన పాలసీ డాక్యుమెంట్స్‌ను జనవరి 26, 27 తేదీల్లోగా అందించాలని హెల్త్‌సెక్రటరీ స్పష్టమైన ఆదేశాలిచ్చా రు. వాటిలో ఇప్పటికే కొన్ని ఓ కొలిక్కి వచ్చాయి. ఈ పాలసీలన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చి, సమగ్ర ఆరోగ్య సంరక్షణ పథకం పేరుతో బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం అధికారికంగా ప్రకటిస్తారని వైద్యవర్గాలు వెల్లడించాయి.

Updated Date - Jan 24 , 2026 | 04:46 AM