Share News

Telangana Government: 19 నుంచి కొత్త సర్పంచ్‌లకు శిక్షణ

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:19 AM

గ్రామ పాలనలో పారదర్శకత, సమర్థతను మరింత పెంచటంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇటీవలఎన్నికైన సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

Telangana Government: 19 నుంచి కొత్త సర్పంచ్‌లకు శిక్షణ

  • షెడ్యూల్‌ ఖరారు చేసిన పంచాయతీరాజ్‌ శాఖ

హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): గ్రామ పాలనలో పారదర్శకత, సమర్థతను మరింత పెంచటంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇటీవలఎన్నికైన సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం పంచాయతీరాజ్‌శాఖ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (టీజీఐఆర్‌డీ) ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు జిల్లాలవారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. ప్రతి జిల్లాలో సర్పంచ్‌లను 5 బ్యాచ్‌లుగా ఏర్పాటుచేసి, ఒక్కో బ్యాచ్‌కు 5 రోజులపాటు తరగతులు నిర్వహిస్తారు. ప్రతి బ్యాచ్‌లో కనీసం 50 మంది సర్పంచ్‌లు ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచ్‌లు శిక్షణ పొందనున్నారు. బస, భోజనం, ఖర్చుల కోసం ఒక్కో సర్పంచ్‌పై ప్రభుత్వం రూ.5,000 వరకు ఖర్చు చేయనుంది. శిక్షణ అందించేందుకు మొత్తం 253 మంది మాస్టర్‌ ట్రైనర్లను ఎంపిక చేసి, వారికి టీజీఐఆర్‌డీలో ఇప్పటికే ఓరియంటేషన్‌ పూర్తిచేశారు. వీరు సర్పంచ్‌లకు పాలన, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రజాసేవ తదితర అంశాలపై శిక్షణ అందిస్తారు.


శిక్షణ ద్వారా గ్రామ స్వరాజ్యానికి పునాది: మంత్రి సీతక్క

గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, పారదర్శక పాలన లక్ష్యంగా సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ (సీతక్క) ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైన ేసవలు అందించేలా శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ సమగ్ర శిక్షణలతో గ్రామ స్వరాజ్యానికి దృఢమైన పునాది ఏర్పడుతుందని అన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 06:20 AM