Share News

Minister Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తాం

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:44 AM

రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను అందిస్తామని, అందుకోసం కోర్టు అడ్డంకులు లేకుండా ఉండేలా విధానాన్ని రూపొందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Minister Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తాం

  • కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం .. అక్రెడిటేషన్‌ కార్డులు తగ్గుతాయనే ప్రచారం సరికాదు

  • ఏ కార్డుకైనా అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి

  • జీవో నంబరు 252లో మార్పులు చేస్తాం 814 జర్నలిస్టు సంఘాలతో పొంగులేటి భేటీ

హైదరాబాద్‌/పంజాగుట్ట, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను అందిస్తామని, అందుకోసం కోర్టు అడ్డంకులు లేకుండా ఉండేలా విధానాన్ని రూపొందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీడియా అక్రెడిటేషన్‌ కార్డుల కోసం జారీ చేసిన జీవో నంబరు 252పై శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో 14 జర్నలిస్టు సంఘాలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల గురించి ప్రస్తావించగా.. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పరిష్కరించిందని, జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీకి భూమిని కూడా అప్పగించామని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ఆ భూముల కేటాయింపు జీవోను రద్దు చేయాలని తీర్పునివ్వడంతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. అయినా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సీఎం రేవంత్‌ సూచనల మేరకు కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందించి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక జీవో నంబరు 252 గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అక్రెడిటేషన్‌ కార్డులు తగ్గుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గతంలో సుమారు 23 వేల అక్రెడిటేషన్‌ కార్డులు ఉంటే.. ఈ సారి ఆ సంఖ్య పెరుగుతున్నట్టు తెలిపారు. కార్డుల జారీలో దేశంలోనే తెలంగాణ మొదటివరుసలో ఉందని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులను ఇచ్చేందుకు శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేశామన్నారు. అక్రెడిటేషన్‌ కార్డుల జారీ కోసం దేశవ్యాప్తంగా నియమ నిబంధనలను పరిశీలించడంలో భాగంగానే కొత్త కార్డుల మంజూరులో జాప్యం జరిగినట్టు తెలిపారు. అయితే మీడియా కార్డుకు, అక్రెడిటేషన్‌ కార్డుకు మధ్య వ్యత్యాసం లేదని, అక్రెడిటేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వ పరంగా అందే ప్రతీ ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా అందుతుంని, ఇందులో అనుమానాలకు తావులేనది స్పష్టంచేశారు. అక్రెడిటేషన్‌ కార్డుల మంజూరు విషయంలో ఎటువంటి భేషజాలకు పోవడంలేదని, ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పత్రికల సర్క్యులేషన్‌, ఇతర వివరాలను కచ్చితంగా సేకరిస్తామని, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సర్టిఫికెట్ల పరిశీలన కూడా చేస్తామన్నారు. దీంతో అసలైన పత్రికలు, పాత్రికేయులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మండలానికో విలేకరి ప్రాతిపదికన కాకుండా జనాభా వారీగా అక్రెడిటేషన్‌ కార్డులు మంజూరుచేస్తే ఎలా ఉంటుందన్న విషయంలోనూ ఆలోచన చేస్తున్నామని, దీనిపై పాత్రికేయ సంఘాలు స్పందించాలని మంత్రి సూచించారు. అక్రెడిటేషన్‌ కమిటీలో ఉర్దూ సంఘాలకు అవకాశం కల్పిస్తామన్నారు. క్రీడా, సాంస్కృతిక, క్రైమ్‌, కేబుల్‌ టీవీ తదితర పాత్రికేయులకు కూడా అక్రెడిటేషన్‌ సౌకర్యం ఉంటుందని చెప్పారు. మహిళా జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు అక్రెడిటేషన్‌ కార్డుల జారీలో ప్రత్యేకంగా కోటా కేటాయిస్తామని హామీనిచ్చారు. ఇక దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోనే డిజిటల్‌ మీడియా కార్డులిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ ప్రియాంకతోపాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారని మంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.


జర్నలిస్టుల సంక్షేమానికి సర్కార్‌ కట్టుబడి ఉంది

తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ కమిటీ రూపొందించిన ప్రెస్‌క్లబ్‌ జర్నల్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రతినెలా ప్రెస్‌క్లబ్‌ జర్నల్‌ను రూపొందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌. విజయకుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ వరికుప్పల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 03:44 AM