Share News

సర్కారుకు పెద్ద సవాల్‌!

ABN , Publish Date - May 06 , 2026 | 06:43 AM

మక్కల సేకరణ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించి వదిలేస్తోంది.

సర్కారుకు పెద్ద సవాల్‌!

  • మక్కలకు మద్దతు ప్రకటన వరకే కేంద్రం

  • రాష్ట్రం ఒత్తిడిచేస్తే 25 శాతం కొనుగోళ్లు

  • తక్కువ ధరకు కొంటున్న ప్రైవేటు ట్రేడర్లు

  • ప్రైవేటుకే వదిలేస్తే రైతులకు భారీ నష్టం

  • భారమైనా పంటను కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం

మక్కల సేకరణ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించి వదిలేస్తోంది. అంతటితో ఆగకుండా ఉత్పత్తిలో 25 శాతమే ఎమ్మెస్పీకి సేకరించాలని షరతులు పెడుతోంది. ప్రైవేటు మార్కెట్‌కు వదిలేస్తే.. రైతులు భారీగా నష్టపోతున్నారు. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. అయినా రైతుల ప్రయోజనాల దృష్ట్యా తప్పక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 చొప్పున నిర్ణయించింది. అయితే మక్కల సేకరణకు రక్షేతస్థాయిలో చాలా సమస్యలు ఎదురవుతు న్నాయి. పౌల్ట్రీ, ఇథనాల్‌, గంజి, బీర్ల కంపెనీలు ధరలు తగ్గిస్తున్నాయి. పంట ఉత్పత్తి, గణనీయంగా పెరిగిన దిగుబడి కారణంగా తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి. కంపెనీలు చెల్లించే ధరలకు అనుగుణంగా.. క్షేత్రస్థాయిలో ఉండే ట్రేడర్లు, దళారులు ధరలు తగ్గిస్తున్నారు. ప్రస్తుతం రూ.1,980 నుంచి రూ.2 వేలకు క్వింటాలు చొప్పున కంపెనీలు మక్కలు కొంటున్నాయి. ట్రేడర్ల లాభం, రవాణా ఖర్చులు పోతే... రైతులకు రూ.1600 నుంచి రూ.1,700 వరకు ధర వస్తోంది. కనీస మద్దతు ధరతో పోలిస్తే రూ.700 నుంచి రూ.800 తక్కువ ధర రైతులకు లభిస్తోంది. ప్రైవేటు కంపెనీలు, టేడర్లు, దళారుల దందాతో మక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేస్తున్న తరహాలో... కేంద్ర ప్రభుత్వమే మక్కలను కొనుగోలు చేయాలని, 25 శాతం పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవటంలేదు.


ప్రైవేటుకు వదిలేస్తే రైతులకు నష్టం

మక్కలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ప్రైవేటుకు వదిలేస్తే రైతులకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థ లేకపోతే... ట్రేడర్లు, దళారులు ఎంత ధర పెడితే అంతే ధరకు రైతులు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. పైగా, తరుగు కూడా ఎక్కువ తీస్తారు. దీంతో మరింత నష్టం కలుగుతుంది. చెల్లింపులకు గ్యారెంటీ ఉండదు. చిన్న చీటీలపై రాసి ఇస్తున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల వరకు వాయిదా పెడుతున్నారు. వెంటనే డబ్బులు కావాలంటే వందకు రెండు రూపాయల లెక్క న నెలకు వడ్డీ కట్‌ చేసుకొని డబ్బులు చెల్లిస్తున్నారు. ఇన్ని సమస్యలు ప్రైవేటు ట్రేడింగ్‌లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలుచేయాల్సి వస్తోంది. రైతులు కూడా ప్రభుత్వ కొనుగోలుకేంద్రాల్లో విక్రయించటానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినపుడు.. రాష్ట్ర ప్రభుత్వమైనా, ప్రైవేటు ట్రేడర్లయినా అదే ధరకు పంట కొనుగోలు చేయాలి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర అందుతోంది. కానీ, ప్రైవేటు మార్కెట్లో కూడా ఎమ్మెస్పీ చెల్లించేలా వ్యాపారులపై ఒత్తిడి చేస్తే రైలుకు మేలు కలుగుతుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. కానీ ప్రభుత్వం ప్రైవేటు ట్రేడర్లను నియంత్రించే సాహసం చేయటంలేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే దేశంలో మక్కలు పండించే ఏ రాష్ట్రంలోనూ అక్కడి ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా పూర్తిగా ప్రైవేటుకే వదిలేస్తున్నాయి.

Updated Date - May 06 , 2026 | 06:44 AM