మక్కలతోపాటు జొన్నలూ
ABN , Publish Date - May 06 , 2026 | 06:40 AM
రాష్ట్రంలోని రైతులు పండించిన మొక్కజొన్న పంటతోపాటు జొన్నలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం
కేంద్రం సహకరించకున్నా కొంటున్నాం
రైతుల ప్రయోజనాలను కాపాడేందుకే: తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతులు పండించిన మొక్కజొన్న పంటతోపాటు జొన్నలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంగళవారం జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, సబ్ కమిటీ సభ్యులకు రాష్ట్ర రైతుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్ పరిధిలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటికీ.. కేంద్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ మొక్కజొన్న, జొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు బహిరంగ మార్కెట్లో లభించిన ధరలకే తమ పంటను అమ్ముకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో మాత్రం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి పంటలను కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించి 278 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులకు నష్టం కలగకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు.
గత ఖరీఫ్ సీజన్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.76 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయాన్ని భరించిందని గుర్తుచేశారు. ఇక ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 11.21 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారని మంత్రి తుమ్మల తెలిపారు. అనుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎకరానికి సగటున 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు పేర్కొన్నారు. జొన్న పంటను 3.68 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటల కొనుగోళ్ల కోసం దాదాపు రూ.6 వేల కోట్ల వరకు వ్యయం చేసినట్లు వెల్లడించారు.