Telangana Government: ఈగల్, హైడ్రా తరహాలో ‘రహదారి భద్రత’కు కొత్త వ్యవస్థ
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:55 AM
రాష్ట్రంలో ట్రాఫిక్, రహదారి భద్రతా విభాగాలకు సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
20 వేల మంది పోలీసులతో ఏర్పాటు!
డీజీపీ స్థాయి అధికారికి సారథ్య బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ట్రాఫిక్, రహదారి భద్రతా విభాగాలకు సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈగల్, హైడ్రా తరహాలో.. 20 వేల మంది పోలీసులతో ప్రత్యేక వ్యవస్థను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. రహదారి భద్రతపై చేపట్టిన ‘అరైవ్.. అలైవ్’ ప్రచార కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించారు. వాస్తవానికి ట్రాఫిక్ విభాగం పటిష్ఠతపై చాలా కాలంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రహదారి ప్రమాద మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉంటోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరించేందుకు గాను అత్యంత శక్తిమంతమైన ట్రాఫిక్, రహదారి భద్రతా వ్యవస్థను తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకు తెలంగాణలో ట్రాఫిక్ విభాగం ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్ల ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఈ విభాగం ట్రాఫిక్ నియంత్రణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ వరకే పరిమితం అవుతోంది. రోడ్డు ప్రమాదాల కేసుల దర్యాప్తును శాంతిభద్రతల విభాగం పోలీసులే చూస్తున్నారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల గుర్తింపు, బ్లాక్ స్పాట్లలో సూచికల ఏర్పాటు తదితర విషయాలపై పోలీసులు అంతగా శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీజీపీ శివధర్‌రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కోసం అరైవ్ అలైవ్ పేరిట ప్రచార కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదగా ప్రారంభింపజేశారు.
డీజీపీ స్థాయి అధికారి ఇన్‌చార్జిగా..
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతకు సంబంధించి గతంలోనే రోడ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేశారు. దీనికి డీజీపీ స్థాయి అధికారి పోస్టును మంజూరు చేసింది. అయితే ఇక్కడ పనిచేసే అధికారికి కావాల్సిన వసతులు ఇవ్వడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న విమర్శలున్నాయి. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావిస్తూ.. రహదారి భద్రతా విభాగంలో పోస్టింగ్ అంటేనే శిక్ష అనే భావనను మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పోలీసు శాఖ రహదారి భద్రతా విభాగం పటిష్ఠతకు రెండు అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లా, కమిషనరేట్లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఓ వ్యవస్థ కిందకు తీసుకురావాలని.. మత్తుమందులపై ఉక్కుపాదం మోపడానికి ఏర్పాటు చేసిన ఈగల్‌లాగా డీజీపీ స్థాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించాలనేది ఒక ప్రతిపాదన అని సీనియర్ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఈ విభాగానికే రోడ్డు ప్రమాదాల కేసుల దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు బాధ్యతలను అప్పగించడంతో పాటు అదనంగా సిబ్బందిని కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వారి సంఖ్య ఐదు వేల లోపే. వీరికి అదనపు సిబ్బందికి కేటాయించగలిగితే రోడ్డు ప్రమాదాల కేసుల దర్యాప్తు కూడా అప్పగించవచ్చనే అంశాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ విభాగాలను పూర్తిగా రహదారి భద్రతా సంస్థ పరిధిలోకి తీసుకొచ్చి ఈ విభాగానికి ట్రాఫిక్ నియంత్రణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, చలాన్ల వసూలు, రోడ్డు ప్రమాదాల కేసుల దర్యాప్తులను అప్పగిస్తూ దానికి డీజీపీ స్థాయి అధికారిని నియమించాలని.. ఇది విజిలెన్స్, ఈగల్, హైడ్రా తరహాలో స్వతంత్రంగా పనిచేసే విధంగా చూడాలనే ఆలోచనను సైతం ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఐదేళ్లలో 30 వేల మందికి పైగా..
రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 30 వేల మందికి పైగా మరణించారు. లక్ష మందికి పైగా గాయపడ్డారు. కేవలం గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లోనే 6,499 మంది మరణించగా, 14,768 మంది గాయపడ్డారు. 2024లో 7,056 మంది మరణించగా, 21,664 మంది గాయపడ్డారు. ఈ మరణాలు యుద్ధానికి మించిన విషాదమని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పేర్కొనడం గమనార్హం. అంటే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లబోతోందన్న విషయం అర్థమవుతోంది.